NOTICES TO YSRCP OFFICES: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయాలపై వివరణ కోరుతూ అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడ విద్యాధరపురంలో నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయానికి కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేరుతో నోటీసులు ఇచ్చారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుకు నోటీసులు అందించేందుకు అధికారులు యత్నించినా, బాధ్యులెవరూ లేకపోవడంతో అక్కడి పిల్లర్‌కు నోటీసులు అంటించారు.
విద్యాధరపురంలో 1.10 ఎకరాల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం 33 ఏళ్లకు ఏడాదికి వెయ్యి చొప్పున లీజుకు కేటాయించగా, ఎటవంటి ప్లాన్ పొందకుండా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మిస్తున్నట్లు గుర్తించామని నోటీసులో వెల్లడించారు. అక్రమ నిర్మాణం కావడంతో తదుపరి చర్యలకు వీలుగా బాధ్యులు ఏడు రోజుల్లోగా తమకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని నోటీసులో సూచించారు. వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలం లీజు వ్యవహారంలో నిబంధనలు ఉల్లఘించారని నోటీసులో వెల్లడించారు.
అదే విధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్మించిన వైఎస్సార్సీపీ కార్యాలయానికి పల్నాడు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిర్మాణాలు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన కార్యాలయాలపై చర్యలు తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Complaint on YSRCP Office Land Issue: నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వద్ద నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయ స్థల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఆ స్థలం తనదేనంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన స్థలాన్ని ఆక్రమించి పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని నగరంలోని జెండా వీధికి చెందిన కౌసర్ జాన్ అనే మహిళ చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా అధికారులెవ్వరూ పట్టించుకోలేదని వాపోయింది. ఒంటరి మైనార్టీ మహిళ స్థలాన్ని కబ్జా చేసి వైఎస్సార్సీపీ నేతలు కార్యాలయం నిర్మించడంపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
TDP Varla Ramaiah On YSRCP Offices: అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అనుమతులు లేని పార్టీ కార్యాలయాలను అధికారులు కూల్చేస్తుంటే వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు. ప్రజా వేదికను కూల్చిన జగన్‌కు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రశ్నించే హక్కు లేదన్నారు. 26 జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా, రాష్ట్రం మీ సొంత జాగీరా అని ప్రశ్నించారు.
Janasena on YSRCP Offices: అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైఎస్సార్సీపీ అడ్డగోలుగా పార్టీ కార్యాలయాలు నిర్మించిందంటూ నెల్లూరులో జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. భగత్ సింగ్ కాలనీ దగ్గర నిర్మిస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయం ఎదుట జనసేన నిరసన కార్యక్రమం చేపట్టింది. పేదల భూములను ఆక్రమించి కట్టుకున్న వైఎస్సార్సీపీ కార్యాలయాలపై సమగ్ర విచారణ జరిపించి, ఆ భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించాలని కోరారు.
స్థానికులు నిరసన: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు స్థానికులు నిరసన చేపట్టారు. కొత్తూరు నర్సింగరావుపే వద్ద ప్రభుత్వ స్థలంలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టారు. ఇటీవల జీవీఎంసీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా నేతలు, స్థానికులు లోపలికి వెళ్లి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భవనాన్ని కాపు సామాజిక భవనానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు.