New Aspects Of Telangana SI Suicide Case: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు ఎస్సై రుద్రారపు హరీశ్ ఆత్మహత్య ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తమ శాఖకు చెందిన యువ అధికారి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు గుర్తించినట్లు సమాచారం.
ఏడు నెలల కిందట హరీశ్ ఫోన్‌కు ఒక కాల్ వచ్చింది. తరువాత ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో హరీశ్ సైతం అంగీకరించాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఛాటింగ్ చేసుకునేవారు. హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో ఆమె సెలవుల్లో వాజేడుకు వచ్చి పోతూ ఉండేది. ఈ క్రమంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె గురించి ఆరా తీసిన ఎస్సైకి కొన్ని నమ్మలేని నిజాలు తెలిశాయి.
ఎస్సై ఆత్మహత్యాయత్నం-సీఐ పై కేసు నమోదు
అసలేం జరిగిందంటే: సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండలానికి చెందిన 26 ఏళ్ల యువతి ఊర్లో ఉన్నప్పుడు ముగ్గురు యువకులతో స్నేహంగా ఉండేది. అందులోని ఒకరు పెళ్లి చేసుకోమని అడగ్గా దానికి నిరాకరించడంతో చిలుకూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇది తెలుసుకున్న హరీశ్ ఆమె పెళ్లి ప్రతిపాదనను నిరాకరించి ఇంట్లో వాళ్లు చూసిన సంబంధం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అదే విషయం ఆమెకు చెప్పడంతో మాట్లాడేందుకు ఆదివారం సాయంత్రం వాజేడు ముళ్లకట్ట సమీపంలోని రిసార్టుకు వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అక్కడే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సెటిల్‌మెంట్ చేసుకోవడానికి ఎస్సై ప్రయత్నించారని ఇందుకు సదరు యువతి ఒప్పుకోకపోవడంతోపాటు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాననడంతో హరీశ్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. తమ కుమారుడి మృతికి ఆ యువతి కారణమంటూ హరీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.