NDA Govt Focus on Suryalanka Beach in Bapatla District : ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు, అందమైన ప్రకృతి సోయగాలు, సుందరమైన అటవీ ప్రాంత ఇవన్నీ బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరప్రాతం సొంతం. ఉదయభానుడి లేలేత కిరణాలు, సూర్యాస్తమయం వేళ మిలమిలా మెరిసే సాగర జలాలు మదిలో ఉల్లాసం నింపుతాయి. అందుకే ఈ అందమైన అనుభూతిని పొందేందుకు, కొద్దిసేపు సరదాగా గడిపేందుకు సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు భారీగా తరలివస్తారు. దీంతో పర్యాటకులకు ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం బీచ్ వద్ద సరికొత్త అభివృద్ధి ప్రణాళికలు చేపట్టింది.
పెద్దఎత్తున పర్యాటకులు : సూర్యలంక సముద్రతీరం నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే బీచ్‌లలో ఇదొకటి. కాలుష్య కారక పరిశ్రమలు లేకపోవడంతో స్వచ్ఛమైన సముద్ర జలాలు ఇక్కడికొచ్చేవారికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. చుట్టూ రెండు కిలోమీటర్ల దూరం మడ అడవులు విస్తరించి ఉండటంతో ఆహ్లాదకరమైన గాలి మనసుకు ఉత్తేజాన్ని కలిగిస్తుంది. బాపట్ల జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ సూర్యలంక బీచ్‌కు రవాణా మార్గం కూడా చాలా అనువుగా ఉంటుంది. బాపట్లలోని భావన్నారాయణ దేవాలయం ఈ తీరానికి ఆధ్యాత్మిక ఆకర్షణ. అందుకే రాష్టంలోని వివిధ ప్రాంతాల వారే కాకుండా తెలంగాణ నుంచి కూడా పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంద రోజుల్లో వంద కోట్లు అంటూ పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించింది.
సర్వాంగ సుందరంగా : ప్రభుత్వం పర్యాటక శాఖకు చెందిన కాటేజీలను రీమోడల్ చేయడమే కాకుండా మరిన్ని కొత్తవాటిని నిర్మిస్తుంది. బీచ్‌కు వచ్చే పర్యాటకలు హరిత రిసార్టు నుంచే సముద్రపు అందాలు చూసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పర్యాటకులు సముద్ర జలాల్లో సేదతీరిన తర్వాత ఇసుక తిన్నెల్లో సరదాగా గడిపేందుకు ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు.
పర్యాటకుల భద్రతకు ప్రత్యేక దృష్టి : అంతేకాకుండా మినీ జీప్ రైడ్స్, గుర్రాలు, ఒంటెలను స్వారీ కోసం అందుబాటులో ఉంచారు. మరోవైపు పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మెరైన్ పోలీసులతో పాటు స్థానిక పోలీసులు, గజ ఈతగాళ్లు పహారా కాస్తున్నారు. గతంతో పోలీస్తే సౌకర్యాలు మెరుగుపడటంతో పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరిగింది. సూర్యలంక బీచ్ చాలా అనుభూతిని పంచిందని మళ్లీ మళ్లీ రావాలని అనిపించేలా ఉందని పర్యాటకులు చెబుతున్నారు.
"బీచ్ చాలా బాగుంది. చాలా ఎంజెయ్ చేశాం. కూర్చోవడానికి ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. వీటితో గుర్రాలు, ఒంటెలు, మిని జీప్ రైడ్స్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీలు సెలవుల రోజుల్లో రావచ్చు. ఇంకొంచెం పరిశుభ్రంగా ఉంచితే బాగుంటుంది "_పర్యాటకులు
విశాఖ బీచ్‌లో 'శారీ వాక్'- ర్యాంప్‌పై సందడి చేసిన వనితలు - saree walk in visakha