Narayanapuram Project modernization Works Delay: ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని నాగావళి నదిపై సంతకవిటి - బూర్జ మండలాల మధ్య నారాయణపురం ప్రాజెక్టుని నిర్మించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పరిధిలోని సంతకవిటి, శ్రీకాకుళం, గార మండలాల్లో 57 వేల 053 ఎకరాల ఆయకట్టు ఉంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరటంతో, ఆధునీకరణకు 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 112.10కోట్ల జైకా నిధులు మంజూరు చేసింది. రెండు ప్యాకేజీలుగా విభజించి, ఏయే పనులు చేపట్టాలన్నది నిర్దేశించింది.
అయితే గత ఐదేళ్లుగా పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. ఏటా పనులు చేపడతామని చెప్పటమే తప్ప అడుగు ముందుకు పడటం లేదు. నదిలో వచ్చిన వరద నీటి ప్రవాహం కుడి, ఎడమ ప్రధాన కాలువలకు మళ్లించాలంటే షట్టర్లు కీలకం. ప్రస్తుతం ఈ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకుంది. ఫలితంగా ఏటా ఆయకట్టుకి సాగునీటి అవస్థలు తప్పటం లేదు. ఇప్పటి వరకు సగటున రెండు ప్యాకేజీల్లోనూ 30 శాతానికి మించి పనులు జరగలేదు. మొత్తంగా ఇప్పటి వరకు 34 కోట్లు వినియోగించినట్లు అధికారులు చెబుతున్నారు.
శంకుస్థాపనలే కానీ నిర్మాణంపై లేదు చిత్తశుద్ధి
ప్యాకేజీ-1లో 62.64 కోట్లతో షట్టర్లు వ్యవస్థ ఆధునీకరణ, ప్రధాన రెగ్యులేటర్, స్పిల్ వే వ్యవస్థ., కాంక్రీటు, రాతి ఏఫ్రాన్ పనుల పునరుద్ధరణతో పాటు ఎడమ, కుడి కాలువ ఆధునీకరణ చేపట్టాలి. ప్యాకేజీ-2లో 49.46 కోట్లతో కుడి ప్రధాన కాలువ లైనింగ్ పనులు, గట్టును పటిష్టపర్చటం, రెగ్యులేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. 50.50 కిలోమీటర్ల పొడవున్న కాలువను పూర్తిస్థాయిలో ఆధునీకరించాల్సి ఉండగా, 4కిలోమీటర్ల మేర మాత్రమే లైనింగ్, 25 కిలోమీటర్ల పొడవు గట్టు పటిష్టపర్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతవరకూ 35 శాతం పనులు మాత్రమే చేపట్టగా వాటి కోసం 17 కోట్లు ఖర్చు చేశారు. పూర్తిస్థాయిలో పనులు జరగకపోవటంపై ఆయకట్టు రైతులు మండిపడుతున్నారు.
నారాయణపురం ఆనకట్టు ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పరిధిలోని సంతకవిటి, శ్రీకాకుళం, గార మండలాల పరిధిలో వేలాది ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కాలవలు బాగలేకపోవటంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందటం గగనమైపోతోంది. ఈ పరిస్థితుల్లో ఏటా పంటను కోల్పోవాల్సి వస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం సమీపిస్తున్నందున ఈ ఏడాది కూడా ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేపట్టలేమని ప్రాజెక్టు డీఈ మురళీకృష్ణ చెబుతున్నారు. ఆనకట్టపైన ఉన్న షట్టర్లు వ్యవస్థకు, కుడి, ఎడమ ప్రధాన కాలువలకు తాత్కాలిక పనులు చేపట్టి ఆయకట్టు రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియచేశారు. రాబోయే కొత్త ప్రభుత్వమైనా సత్వరమే ఆధునికీకరణ పనులు చేపట్టి తమను ఆదుకోవాలని రైతులు కోరుకున్నారు.