Nara Brahmani Stree Shakti Program with Dwakra womens: ఆవకాయ పెట్టాలన్నా, అంతరిక్షానికి వెళ్లాలన్నా మహిళలకే సాధ్యమని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. మహిళలంటే మహాశక్తి అని నేడు ఆకాశమే హద్దుగా అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా తాడేపల్లిలో స్త్రీ శక్తి, డ్వాక్రా మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశమయ్యారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలసి నారా బ్రాహ్మణి కేక్ కట్ చేశారు.
ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమానహక్కు, స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. మహిళా యూనివర్సిటీ స్థాపించింది కూడా ఎన్టీఆరేనని గుర్తుచేశారు. తాతా ఆశయాలను చంద్రబాబు, లోకేశ్‌లు కొనసాగించారన్నారు. చంద్రబాబు, లోకేశ్‌లు మహిళా సాధికారితకు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారన్నారు. అందుకు నేనే ఉదాహరణని చెప్పారు. వివాహమయ్యాక వారి ప్రోత్సహంతోనే నేను యూఎస్, సింగపూర్ వెళ్లి ఉన్నత చదువులు చదివానన్నారు.
గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని సేవలందిస్తున్నారని, ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి ప్రజలను తమ కుటుంబసభ్యుల్లా భావిస్తూ సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 1600 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి మెషీన్లు అందజేశామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత చేస్తున్నారంటే ఎమ్మెల్యేగా ఎన్నికైతే లోకేశ్ ఎంత సేవ చేస్తారో మహిళలంతా ఆలోచించాలని బ్రాహ్మణి కోరారు.
మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు, లోకేశ్ నిరంతరం పరితపిస్తారని బ్రాహ్మణి తెలిపారు. డ్వాక్రా సంఘాల్లో ప్రస్తుతం కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, డ్వాక్రా గ్రూపులు ఈ స్థాయికి చేరాయంటే అందుకు చంద్రబాబే కారణమని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొట్ట మొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే అని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు మహిళ విద్యకు అడ్డంకి కాకూడదన్న ఉద్దేశంతో ఇటీవల ‘కలలకు రెక్కలు’ అనే కార్యక్రమం ప్రకటించారని అన్నారు. దీని ద్వారా ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణం లభిస్తుందని చెప్పారు.
ఉమ్మడి ఏపీలో పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సుల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించారని బ్రాహ్మణి అన్నారు. పేద ప్రజలకు కష్టాల నుంచి ఉపశమనం కలిగించేందుకే సూపర్-6 పథకాలను ప్రకటించారన్న బ్రాహ్మణి, మహిళల ఆదాయాన్ని పెంచి వారికి ఆర్థికంగా చేయూత అందించాలని నారా లోకేశ్ మంగళగిరిలో స్త్రీశక్తి పథకాన్ని అమలుచేస్తున్నారని తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం సొంత నిధులతో 29 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో మీరంతా లోకేశ్‌ను ఆశీర్వదిస్తే మరింత మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందిస్తారని బ్రాహ్మణి తెలిపారు.