Andaman And Nicobar Islands TDP President : తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవులకు టీడీపీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావు నియామిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసింది. జనాభా పరంగా తెలుగు వారు మూడో స్థానంలో ఉన్న అండమాన్ - నికోబార్ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌లో తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో తన ఉనికి చాటుకుంటూ వస్తోంది. గత ఏడాది (2023)లో పోర్ట్‌బ్లెయిర్ నగరంలో ఐదో వార్డు కౌన్సిలర్‌గా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎస్ సెల్వి ఛైర్‌పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలో బీజేపీ మద్దతుతో విజయం సాధించారు. 24 స్థానాలున్న కౌన్సిల్‌లో ఆమెకు 14 ఓట్లు దక్కాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు వెలుపల మరో ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్ వంటి కీలకమైన పదవిని గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
అలాగే పోర్ట్‌బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్‌కి 2010లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేసి 4 శాతం ఓట్లతో పాటు, ఒక సీటును సైతం గెలుచుకుంది. అప్పటికి ఇంకా టీడీపీ అండమాన్-నికోబార్ శాఖకు గుర్తింపు రాకపోవడంతో పార్టీ గుర్తుపై పోటీ చేయలేకపోయింది. 2015 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ అండమాన్-నికోబార్ శాఖకు గుర్తింపు లభించడంతో సైకిల్ గుర్తుపై పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 12 శాతం ఓట్లు సాధించిన టీడీపీ, రెండు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకుంది. 2022వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ రెండు స్థానాలు గెలుచుకుంది. పోర్ట్‌బ్లెయిర్‌లో మొత్తం 24 వార్డులు ఉండగా, అందులో బీజేపీ 10, కాంగ్రెస్ 10, టీడీపీ 2 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి ఒక చోట, డీఎంకే అభ్యర్థి ఒక చోట గెలుపొందారు.
పోర్ట్‌బ్లెయిర్ నగర జనాభా సుమారు 1.25 లక్షలుగా ఉంది. మున్సిపాలిటీ పరిధి సుమారు 18 చ.కి.మీ.లు. కౌన్సిల్ బడ్జెట్ సుమారు 45 కోట్ల రూపాయలు. మున్సిపల్ కౌన్సిల్‌లో నేరుగా ప్రజల నుంచి ఎన్నికైన 24 మంది కౌన్సిలర్లతో పాటు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు.