Mylavaram Textile Park Works Doing Fastly in YSR District : వైఎస్సార్ జిల్లాలోని నేతన్నల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. కూటమి ప్రభుత్వ చొరవతో ఏళ్ల తరబడి మూలన పడ్డ మైలవరం టెక్స్‌టైల్స్ పార్కుకు మహర్దశ వచ్చింది. ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు వెచ్చించడమే కాకుండా యూనిట్ల ఏర్పాటుకు ప్లాట్లనూ సైతం కేటాయించింది.
రూ.కోటికిపైగా నిధులు విడుదల : వైఎస్సార్ జిల్లాలో మైలవరం, జమ్మలమడుగులో నేతన్నలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ టెక్స్‌టైల్స్ పార్కు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది. 2005లో టెక్స్‌టైల్స్ పార్కుకు 62.18 ఎకరాలు కేటాయించగా అప్పట్లో కొద్దిమేర పనులు జరిగినా ఆ తర్వాత అటకెక్కాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో నేతన్నల విన్నపాలు అరణ్యరోదనగానే మిగిలాయి. తాజాగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం నేతన్నల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. టెక్స్‌టైల్ పార్కులో మరమ్మతుల కోసం కోటి రూపాయలకుపైగా నిధులు విడుదల చేసింది.
రూ.50 లక్షల చొప్పున రుణాలు : ఇక్కడ 118 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. చేనేత, పవర్‌లూమ్స్, డైయింగ్, గార్మెంట్స్, డ్రాయింగ్, స్టిచ్చింగ్, సిల్క్ ట్విస్ట్ యూనిట్ల ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో టెక్స్ టైల్స్ పార్కు ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ చర్యలు చేపట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున రుణాలు అందించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు పూర్తయినట్లు టైక్స్‌టైల్ పార్క్ కమిటీ సభ్యులు తెలిపారు.
"కూటమి ప్రభుత్వరాకతో జిల్లాలోని నేతన్నల కల నెరవేరబోతోంది. గతంలో ఎటువంటి కరెంటు సరఫరా, రోడ్డు సౌకర్యం లేకుండానే నామమాత్రపు పనులు చేశారు. కూటమి ప్రభుత్వ చొరవతో మైలవరం టెక్స్‌టైల్స్ పార్కుకు మహర్దశ వచ్చింది. ఇప్పటికే టెక్స్‌టైల్ పార్కులో మరమ్మతుల కోసం ప్రభుత్వం కోటి రూపాయలకుపైగా నిధులు విడుదల చేసింది. వివిధ బ్యాంకులు సైతం ఇక్కడకు వచ్చి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాయి." - కొండయ్య, టెక్స్‌టైల్ పార్క్ కమిటీ అధ్యక్షుడు
10వేల మంది ఉపాధికి భరోసా : టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటైతే ప్రత్యక్షంగా 3 వేల మందికి , మరో 7 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని కార్మిక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా నేతన్నల ఆదాయ వనరులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.