Most Talented Chess Player From Vijayawada: కృషి, పట్టుదలకు తోడు నిరంతర సాధనతో ఎలాంటి లక్ష్యాలనైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు విజయవాడకు చెందిన చదరంగం క్రీడాకారుడు. కోచ్ శిక్షణ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చదరంగం క్రీడలో దూసుకుపోతున్నాడు. గ్రాండ్ మాస్టర్ కావాలన్న తన లక్ష్య ఛేదన కోసం నిరంతరం సాధన చేస్తున్నాడు.
విజయవాడలోని సీతారాంపురానికి చెందిన శివప్రసాద్, ఉమాల ఏకైక కుమారుడు జూలూరు అక్షిత్ కుమార్. చదరంగంలో చిన్నప్పటి నుంచే మెలకువలు నేర్చుకున్నాడు. 2009లో గ్లోబల్ చెస్ అకాడమీ శిక్షణ శిబిరంలో చేరిన అక్షిత్ అనతి కాలంలోనే చదరంగంలో ప్రావీణ్యం సంపాధించాడు. యూరప్ సహా ఇప్పటివరకు 11 దేశాల్లోని వివిధ టోర్నీల్లో పాల్గొని తన "ఎలో" రేటింగ్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నాడు.
నలంద విద్యానికేతన్‌లో పాఠశాల విద్యను అభ్యసించిన అక్షిత్ చదువులోనూ భేష్ అనిపించుకున్నాడు. పదో తరగతిలో 95 శాతం మార్కులు సాధించాడు. చదువుతోపాటు చదరంగంలో విశేషంగా రాణిస్తున్న ఈ యువకుడికి పీబీ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం అండగా నిలిచింది. చదరంగం పోటీలకు ఐరోపా వెళ్లేందుకు 2 లక్షల రూపాయల ఆర్థికసాయం చేసింది. ఒకప్పుడు ఖాసీం శిక్షణ అందించగా ఇప్పుడు ఒడిశాకు చెందిన దేబాసిస్ దాస్ ఆధ్వర్యంలో అక్షిత్ శిక్షణ అందుకుంటున్నాడు.
ఎంబీబీఎస్, పీజీ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులు- గవర్నర్ చేతుల మీదుగా బంగారు పతకాలు
సాధన ప్రారంభించిన నాలుగు నెలలకే జిల్లాస్థాయి అండర్-17 చదరంగం ఛాంపియన్ షిప్ పోటీల్లో విజేతగా నిలిచాడు అక్షిత్. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదిగి న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత స్కూల్స్ చెస్ ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. చదరంగానికి దేశంలో మంచి ఆదరణ ఉందని క్రీడాకారులకు మంచి సహకారం అందుతుందని చెబుతున్నాడు.
హైదరాబాదులో ఆలిండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీలో పసిడి పతకాన్ని సాధించాడు ఈ యువకుడు. 2012లో కామన్వెల్త్ చెస్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓపెన్ కేటగిరీలో పాల్గొని, ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్ షిప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. చెన్నైలో 2011లో కేసీఎఫ్ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నీలో కేటగిరీలో పసిడి పతకాన్ని అందుకున్నాడు.
"వేసవి సెలవుల్లో నేను ఇంట్లో టైమ్ వేస్ట్ చేస్తున్నాననే ఉద్దేశంతో మా తల్లిదండ్రులు నన్ను గ్లోబల్ చెస్ అకాడమీలో జాయిన్ చేశారు. రెండు నెలలపాటు సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ తీసుకున్న తర్వాత అక్కడ నిర్వహించిన టోర్నమెంట్లో నేను విజేతగా నిలిచాను. దీంతో మా కోచ్ ఖాసిం చదరంగంలో మెలకువలు మెరుగుపర్చుకునేందుకు మరింత శిక్షణ తీసుకోమన్నారు. ప్రస్తుతం ఒడిశాకు చెందిన దేబాసిస్ దాస్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నాను. మా తల్లిదండ్రులు ప్రోత్సహంతో చదరంగంలో మెలకువలు మెరుగుపర్చుకుంటున్నాను." - అక్షిత్ కుమార్, చెస్ క్రీడాకారుడు
2021లో ఫ్రాన్సులో ఇంటర్నేషనల్ ర్యాపిడ్ ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు అక్షిత్. 2022లో ఇటలీలో స్పిలింబెర్గో ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నీలో రజత పతకం సాధించాడు. 2023లో రుమేనియాలో 16వ ఆరాడ్ ఓపెన్ గ్రాండ్ ఫ్రిక్స్ రుమేనియా క్లాసిక్ టోర్నీలో అక్షిత్ మొదటిస్థానం సాధించాడు. ప్రత్యర్థి ఎవరన్నది తను చూడనని, తన సహజ శైలిలో ఆడటం తనకు ఇష్టం అంటున్నాడు అక్షిత్.
సిసిలియన్ డిఫెన్స్ ఓపెనింగ్ ఎంచుకోవడం ఇష్టమంటున్న అక్షిత్, విశ్వనాథన్ ఆనంద్, రష్యా చెస్ దిగ్గజం అనతోలి కార్పోవ్ తన అభిమాన ఆటగాళ్లని చెబుతున్నాడు. ప్రస్తుతం 2 వేల 250 "ఎలో" రేటింగ్ పాయింట్లు కలిగి ఉన్నాడు. తర్వాత ఇంటర్నేషనల్ మాష్టర్ నార్ములు సాధించి అంతిమంగా గ్రాండ్ మాష్టర్ కావాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు.
చదరంగంలో అక్షిత్‌ది ప్రత్యేక శైలిగా మెచ్చుకుంటారు అతని కోచ్ ఖాసీం. మిడిల్, ఫినిషింగ్‌లో అక్షిత్ మంచి ప్రావీణ్యం చూపుతున్నాడని కోచ్ ప్రశంసించారు. మును ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు అక్షిత్ ఎదుగదలలో కీలకభూమిక పోషించారు. విదేశాలకు వెళ్లేందుకు స్పాన్సర్లు సహకరిస్తే అక్షిత్ మరిన్ని విజయాలు సాధిస్తాడని అక్షిత్ తండ్రి నమ్మకంగా చెబుతున్నారు.
అంతర్జాతీయ జల సదస్సులో 'ఫ్లాష్ మాబ్' - ప్రతినిధుల మెప్పు పొందిన 'ఆంధ్ర' విద్యార్థుల మైమ్