Moneylender Brutal Murder in Mopidevi : వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన బాపట్ల మండల పరిధిలోని సూర్యలంకలో జరిగింది. వ్యాపారి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నా బాధితుడు ద్విచక్ర వాహనంపై కొద్ది దూరం వెళ్లి బీచ్ సమీపంలో దుకాణాల వద్ద కుప్పకూలి మృతి చెందాడు. పోలీసులు, స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం,
కృష్ణా జిల్లా మోపిదేవి సమీపంలోని కొత్తపల్లికి చెందిన బాచు యేసుబాబు (45) 20 సంవత్సరాల క్రితం బాపట్లలోని కారుమూరి హనుమంతరావునగర్ కాలనీలో స్థిరపడ్డాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. సూర్యలంకలో వ్యాపారుల నుంచి వడ్డీ వసూలు చేయటానికి సోమవారం ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. వాయుసేన కేంద్రం సమీపంలో చప్టా వద్ద యేసుబాబుపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశారు. అనంతరం గొంతు కోశాడు.
బీచ్‌లో దారుణం - ఓ వ్యక్తి గొంతు కోసి పరారైన దుండగులు
అతని నుంచి తప్పించుకున్న వ్యాపారి మెడకు కండువా కట్టుకుని కొద్ది దూరం ద్విచక్ర వాహనంపై వచ్చి మెరైన్ పోలీస్‌స్టేషన్ రోడ్డు సమీపంలోని దుకాణాల వద్ద కింద పడిపోయాడు. తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. అది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. 25 నిమిషాల పాటు ప్రాణాలతో ఉన్న వ్యాపారి అంబులెన్స్ వచ్చే సమయానికి మృతి చెందాడు. ఘటనా స్థలానికి డీఎస్పీ జి.రామాంజనేయులు, బాపట్ల గ్రామీణ సీఐ కె.గంగాధరరావు చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించారు.
అక్కడే ఉన్న స్థానికులతో మాట్లాడగా అతను మృతి చెందే ముందు 'చంటి చంటి' అని పలు మార్లు అన్నాడని వారు తెలిపారు. వడ్డీ వసూలులో చంటి అనే యువకుడు యేసుబాబు వద్ద సహాయకుడిగా గత కొద్ది రోజులుగా పని చేస్తున్నాడు. దీంతో పోలీసులు చంటిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని బాపట్ల ప్రాంతీయ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుడికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. హత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పర్యాటకుల రాకపోకలతో రద్దీగా ఉంటే బాపట్ల - సూర్యలంక రోడ్డులో వాయుసేన కేంద్రానికి సమీపంలో హత్య జరగటం స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిపై బాపట్ల గ్రామీణ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.