Balakrishna Inspected TIDCO Houses: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా హిందూపురం గ్రామీణ మండలం కోటిపి సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయిన టిడ్కో ఇళ్లను హిందూపురం ఎంపీ పార్థసారథితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అంతులేకుండా సాగిందని, తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయన్నారు.
నందమూరి తారక రామారావు పేదలకు ఇల్లు నిర్మించాలని ఆనాడే పక్కా ఇళ్ల పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. గతంలో తెలుగుదేశం పాలనలో అద్దె ఇళ్లలో ఉన్న పేదలందరికీ పక్కా ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో నూతన సాంకేతిక విధానాన్ని అనుసరించి టిడ్కో ఇల్లు నిర్మాణం ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం మారడంతో నేటి వరకు అవి అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వీటన్నిటి నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసి సంబంధిత లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామన్నారు.
అభిమానికి ఊహించని గిఫ్ట్- కుటుంబంతో కలసి భోజనం చేసిన బాలయ్య - Balakrishna Lunch With his fan
హిందూపురం అభివృద్ధి విషయాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడినట్లు వివరించారు. 2019 నుంచి 2024 వరకూ పాలనా అనుభవం లేని వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలించడం, ఇసుక అక్రమ రవాణా, అక్రమ మద్యం ఇలా దోచుకోవడమే లక్ష్యంగా ఐదేళ్లు కొనసాగిందన్నారు.
కూటమి ప్రభుత్వంలో హిందూపురం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, యువతకు ఉపాధినిచ్చే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో తవ్విన కొద్దీ అవినీతి డొంక కదులుతోందని, అక్రమాలపై నిగ్గు తేలుస్తామన్నారు. గత ప్రభుత్వంలో దోపిడీ యథేచ్ఛగా సాగిందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
బాలయ్య గోల్డెన్ జూబ్లీ- గ్రాండ్గా సెలబ్రేషన్స్- ఎప్పుడంటే?
అనంతరం హిందూపురం గ్రామీణ మండలం కోటిపి సమీపంలో 5.73 కోట్లతో నిర్మించే విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఎమ్మెల్యే బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ విద్యుత్ సబ్ స్టేషన్ ద్వారా 10 గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఆ తరువాత హిందూపురం పట్టణం సద్గురు యోగి నారాయణ తాతయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్న సంతర్పణను ప్రారంభించి, అన్నం వడ్డించారు. అనంతరం పట్టణంలోని స్థానిక పరిగి బస్టాండ్ ప్రాంతంలో 26 లక్షలతో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు.