Missing Cases Chased By Special Police Team Of vijayawada Commissionerate : 14 సంవత్సరాల ఆ బాలికకు చదువంటే ప్రాణం. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తల్లిదండ్రులు ఆమెను పనిలో పెట్టారు. పని చేయడం ఇష్టం లేని బాలిక విజయవాడ శివారు నిడమానూరు గ్రామంలోని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. పటమట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన 2017లో జరిగింది.
19 ఏళ్ల యువతికి పటమటలో ఉండే ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు నిర్ణయించారు. పెళ్లి ఇష్టం లేని యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 2021లో దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
మరో యువతి వయసు 19. ఆమెకు మతిస్థిమితం సరిగా లేదు. కుటుంబసభ్యులతో పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ తిరునాళ్లకు వెళ్లారు. అక్కడ ఆమె తప్పి పోయింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలిస్తే ఆటో ఎక్కి వెళ్లినట్లు గుర్తించారు. ఆమె వద్ద సెల్‌ఫోన్ లేదు. పేరు వివరాలు సరిగా చెప్పలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగింది.
ఇలాంటి కేసులను పరిష్కరించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీసీపీ గౌతమిశాలి పర్యవేక్షణలో సీఐ చంద్రశేఖర్, ఎస్సై హైమావతి నేతృత్వంలో ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. అత్యంత సున్నితమైన పై మూడు కేసులను వీరు చేధించారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరితో పాటు మతిస్థిమితం లేని యువతిని సైతం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఏడేళ్లుగా ముందుకు కదలని బాలిక అదృశ్యం కేసు ఎట్టకేలకు కొలిక్కి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
12 ఏళ్లప్పుడు ఖలీల్‌ఘోరి ఇప్పుడు అభినవ్‌సింగ్ - అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ
తరచి తరచి ప్రశ్నించారు : 7 సంవత్సరాలుగా కొలిక్కి రాని బాలిక మిస్సింగ్ కేసు పోలీసులకు సవాలుగా నిలిచింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా నిశితంగా దర్యాప్తు చేపట్టింది. బంధువులను మళ్లీ విచారించారు. తరచి తరచి ప్రశ్నించారు. ముదినేపల్లిలోని ఒక బంధువుతో బాలిక మాట్లాడుతున్నట్లు తెలుసుకున్నారు. వారి ద్వారా ఆమెను అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం తన్నూరులో గుర్తించారు. భర్త, కుమారుడితో ఉన్న ఆమెను తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
పెళ్లంటే ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి నెల్లూరు శ్రీసిటీ సెజ్‌లోని ఒక పెట్రోల్‌బంక్‌లో పని చేస్తున్నట్లు గుర్తించి తీసుకువచ్చారు. అదే విధంగా మతిస్థిమితం లేని యువతిని జంగారెడ్డిగూడెంలో గుర్తించి ఆమెను కూడా తీసుకువచ్చారు.
ఇంకా 102 కేసులు ట్రేస్ కావాలి : మహిళలు, బాలికల మిస్సింగ్ కేసుల దర్యాప్తునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నెల రోజుల వ్యవధిలో 30 కేసులను చేధించారు. వారితో పాటు మిగిలిన పోలీస్‌స్టేషన్ల అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా ఈ తరహా కేసులను దర్యాప్తు చేశారు. వారు 59 కేసులను చేధించగా మొత్తం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో మొత్తం 89 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో 102 కేసులు ట్రేస్ కావాల్సి ఉంది.
మేకలతో అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు - వారం రోజులు అడవిలో ఎలా గడిపిందంటే!