Ministers Review Meetings: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్ట్‌ని అడ్డాగా మార్చుకుని ఆహార మాఫియా నడిపించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో శాఖలన్నీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కుటుంబం కోసమే పని చేశాయని మంత్రి ఆరోపించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాల శాఖలో వ్యవస్థాపరమైన లోపాలను అధికారులతో చర్చించారు.
గత ప్రభుత్వ హయాంలో చేనేత రంగం కుదేలైందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. నేతన్నలను ఆదుకునేందుకు గతంలో అందించిన సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మూతపడిన ఆప్కో దుకాణాలు తిరిగి ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా మంత్రి సవిత హాజరయ్యారు. పెనుకొండను అభివృద్ధి బాటలో నడిపిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా కౌన్సిల్ సభ్యులందరూ అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని మంత్రి సూచించారు.
పచ్చదనం మాటున వైఎస్సార్సీపీ నేతల దోపిడీ - చర్యలకు జనసేన డిమాండ్ - Corruption in plant breeding
పెనుకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పిల్లలందరికీ ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు. కళాశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు ఉపయోగించే మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలని, లేకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉందని మంత్రి సవిత అన్నారు.
రాష్ట్రంలో జగన్ సర్కారు అప్పులు తప్ప ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. రాష్ట్రంలోని నగరపాలక సంస్థల పరిస్థితిపై సచివాలయంలో నగరపాలక కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ కోసం 2014 తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు తీసుకోస్తే వాటిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కార్పొరేషన్ల నిధులు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, డయేరియా అదుపు, తాగునీటి సరఫరాపై వారితో చర్చించారు. 203 అన్న క్యాంటీన్లను 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో అన్న క్యాంటీన్ ఏర్పాటుకు గిరిజనశాఖ మంత్రి సంధ్యారాణి, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, అధికారులు, నాయకులు స్థల పరిశీలన చేశారు. మున్సిపల్ కమిషనర్ 15 రోజులు సెలవులో ఉండటం వలన ఇంఛార్జ్ ఉద్యోగి మున్సిపల్ మేనేజర్ని పిలిచి స్థలాన్ని చూపించారు. వెంటనే అన్న క్యాంటీన్ ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.