Narayana on Tidco Houses : గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకులకు డీడీల చెల్లింపుల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో టిడ్కో ఇండ్లపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో ఈ మేరకు నారాయణ ప్రకటన చేశారు.
స్వల్ప కాలిక చర్చలో 18 మంది ఎమ్మెల్యేలు వారివారి నియోజకవర్గాల్లో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తొలుత చర్చ ప్రారంభించిన బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. లబ్ధిదారులు కూడా బ్యాంకుల నుంచి వస్తున్న నోటీసులతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
AP Assembly Sessions 2024 : సభ్యులు వివరించిన లబ్ధిదారుల ఇబ్బందులు, వారి సమస్యలను నారాయణ విని సమాధానం ఇచ్చారు. టిడ్కో ఇళ్ల అనుమతుల నుంచి నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలిపోవడానికి గల కారణాలను వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేంద్రం నుంచి 7 లక్షల ఇళ్లకు పైగా అనుమతి తీసుకొచ్చామని గుర్తుచేశారు. 2014-2019 మధ్యలో హై క్వాలిటీ ఇళ్లను టిడ్కో ద్వారా చేపట్టామని నారాయణ వెల్లడించారు.
కేంద్రం అనుమతి ఇచ్చిన వాటిలో ముందుగా 5 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టేలా నాటి టీడీపీ ప్రభుత్వంలో పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశామని నారాయణ వివరించారు. ఈ క్రమంలోనే 4,54,706 ఇండ్లకు టెండర్లు పిలిచి నిర్మాణాలు ప్రారంభించామని చెప్పారు. 2019 మే నెల నాటికి 77,370 ఇళ్లు వంద శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. మరోవైపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండా మొత్తం ఇళ్లను 2,62,216కి తగ్గించిందని నారాయణ విమర్శించారు.
అక్రమాలపై విచారణ జరిపిస్తాం : దేశంలో ఏ రాష్ట్రంలో కూడా షీర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించలేదని నారాయణ స్పష్టం చేశారు. వీటిలో మొత్తం రూ.38,265 కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌లో రూ.7500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా ఏపీ సర్కార్ రూ.17,730 కోట్లు నిధులు భరించేలా ప్రణాళిక చేపట్టామన్నారు. కొన్ని చోట్ల టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు పొందిన లబ్ధిదారులను తొలగించడంతో పాటు మరికొంతమంది డీడీలు చెల్లించినప్పటికీ వాటిని బ్యాంకుల‌్లో జమ చేయలేదని చెప్పారు. ఈ రెండు అంశాలపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు నారాయణ సభలో ప్రకటించారు.
గత ప్రభుత్వం లబ్ధిదారులకు చెల్లించాల్సిన వాటాలో గందరగోళం చేసి అస్తవ్యస్థంగా మార్చేసిందని నారాయణ ఆరోపించారు. మరోవైపు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేశామని చెప్పారు. అయితే జగన్ మాత్రం అన్నింటిని పూర్తిగా వదిలేశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలతో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమని నారాయణ వ్యాఖ్యానించారు.
నిర్మాణం పూర్తి కాని ఇళ్ల లబ్ధిదారులను బ్యాంకులు లోన్లు చెల్లించాలని అడుగుతున్నారని వారంతా ఇప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని నారాయణ వివరించారు. ఈ విషయంపై బ్యాంకులతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. వారికి తగిన న్యాయం చేస్తామని తెలిపారు. ఎలాంటి పాలనా అనుమతుల్లేకుండా టిడ్కో ఇళ్లకు వైఎస్సార్సీపీ రంగులు వేశారని, దానికి బిల్లులు చెల్లించలేమని తేల్చిచెప్పారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు కాంట్రాక్టర్లకు రూ.540 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని నారాయణ వివరించారు. వారి సమస్యలపై చీఫ్ ఇంజినీర్లతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రస్తుతం టిడ్కో ఇళ్లకు మౌలిక వసతుల కల్పన కోసం రూ.5200 కోట్లు అవసరం అవుతుందన్నారు. ఇందుకోసం హడ్కో ఇతర బ్యాంకుల నుంచి రుణం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వీలైనంత త్వరగా టిడ్కో ఇండ్లలో మౌళిక వసతుల కల్పన పూర్తి చేసి లబ్ధిదారులకు వీలైనంత త్వరగా అందిస్తామని నారాయణ స్పష్టం చేశారు.