Minister Nara Lokesh review meeting: విద్యాశాఖపై రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని, అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై నారా లోకేశ్ ఆరా తీశారు. మధ్యాహ్న భోజనం రుచిగా, నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకం డైరక్టర్ అంబేద్కర్‌కు లోకేశ్ సూచించారు. పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్ కు సంబంధించిన విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష అధికారుల్ని ఆదేశించారు. బడిలో చేరి మధ్యలో మానేసిన డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని అన్నారు.
గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని లోకేశ్ అన్నారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్ బి వినియోగం మీద సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీబీఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్‌తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే 82వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు, అదే విధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో నివేదిక ఇవ్వాలని మంత్రి లోకేశ్ చెప్పారు. స్టూడెంట్ కిట్‌ను అందించడాన్ని ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాక్ పాక్ అందించాలని లోకేశ్ ఆదేశించారు. ఇంటర్ విద్యార్థుల కోసం ఈ నూతన విధానాన్ని అమలుచేయనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేశ్ స్పష్టం చేశారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిల వివరాలపై నారా లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించలేదని, ఫీజు బకాయిలు చెల్లించనందువల్లే సర్టిఫికెట్లు నిలిచిపోయాయని నారా లోకేశ్ పేర్కొన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థల్లోని వివరాలు ఇవ్వాలని కోరారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఏమేరకు ఉండాలనే విషయమై నోట్ సమర్పించాలని లోకేశ్ ఆదేశించారు. ఉన్నత విద్యాసంస్థల్లో ఖాళీలు, రిక్రూట్‌మెంట్ ఫ్యాకల్టీ వివరాలు అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో ఉన్నత విద్యకు సంబంధించిన పెండింగ్ అంశాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడంపై రిపోర్ట్ చెయ్యాలని లోకేశ్ వెల్లడించారు. యూనివర్సిటీల ర్యాంకింగ్స్ పడిపోవడానికి కారణాలను అధ్యయనం తిరిగి పూర్వవైభవం తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యల పై రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. వివాదాస్పద వీసీలు, యూనివర్సిటీల్లో జరిగిన అవినీతి ఆరోపణలపై కూడా సమగ్ర వివరణ కావాలని ఉన్నతాధికారులకు లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.