Minister Nara Lokesh 41 Day Praja Darbar Program : మంత్రి లోకేశ్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లోకేశ్‌ని స్వయంగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఆర్ధిక సాయం, పెన్షన్ మంజూరు, ఉద్యోగ అవకాశం ఇప్పించాలంటూ వినతిపత్రాలు అందజేశారు. గత ప్రభుత్వం తనకు రైతు కూలీ పెన్షన్ నిలిపివేసిందని తిరిగి పునరుద్ధరించాలని యర్రబాలెంకు చెందిన రమాదేవి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరులోని పులివాగు ఆక్రమణలతో ఏటా తమ పంటలు ముంపునకు గురై తీవ్రంగా నష్టపోతున్నామని వాటిని తొలగించి, కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.
'2 లక్షలకు 7.50 లక్షలు వసూలు చేశారు - మరో 4 లక్షలివ్వాలని వేధిస్తున్నారు'
వారసత్వంగా సంక్రమించిన సుమారు 20 ఎకరాల ఈనాం భూములను పలువురు ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని కడప జిల్లా కలసపాడు మండలం ముద్దంవారిపల్లికి చెందిన గ్రామస్థులు మంత్రిని కోరారు. తిరుపతిలోని శీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 30 మంది బోధనేతర సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సిబ్బంది లోకేశ్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వరదలతో సర్వస్వం కోల్పోయామని, తమకు పరిహారం అందించాలని విజయవాడ నందమూరి నగర్, అంబాపురానికి చెందిన పలువురు బాధితులు లోకేశ్‌కు విన్నవించారు.
నారా లోకేశ్ ప్రజాదర్బార్ - వివిధ సమస్యలతో బాధితుల రాక - Nara Lokesh Praja Darbar
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన భూమి కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి దక్కడంతో కాకినాడకు చెందిన వ్యాపారి చలికి వీరేంద్ర ఆనందం వ్యక్తం చేశారు. టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘లోకేశ్ గారి ప్రజాదర్బార్‌లో నా భూమి సమస్య పరిష్కారమైంది కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆకర్షిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ కలెక్టరేట్‌లో భూ దస్త్రాలు దిద్దేసి వీరేంద్రకు చెందిన చీడీలపొర ప్రాంతంలోని ఎకరం భూమిని ఆక్రమించడం సంచలనం కలిగించింది. దీంతో లోకేశ్‌కు యువగళం పాదయాత్రలోను, ప్రభుత్వం వచ్చాక ప్రజా దర్బార్‌లోనూ సమస్య విన్నవించారు. సానుకూల స్పందన రావడంతో ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న వీరేంద్ర ఆ స్థలంలో ఇలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.