Minister Nadendla Manohar on Ration Rice Illegal Export: కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా కోసం గత ప్రభుత్వంలో పెద్ద కుట్రే జరిగిందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేవీ రావును బెదిరించి కాకినాడ పోర్టును అరబిందో రియాల్టీకి కట్టబెట్టిన తర్వాత, అక్కడి నుంచి పెద్దఎత్తున బియ్యం ఎగుమతి జరిగిందని వివరించారు. గత మూడేళ్లలో 45 వేల కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి తరలించారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియాను అరికడతామని మంత్రి స్పష్టం చేశారు.
ఐదేళ్లపాటు పోర్టులోకి ఎవరినీ రానివ్వలేదు: రేషన్ బియ్యం కోసం ఏటా రూ.12,800 కోట్ల ఖర్చు అవుతోందని, కూటమి ప్రభుత్వం వచ్చాక అక్రమ నిల్వలపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడలో జూన్ చివరిలో 13 గిడ్డంగుల్లో తనిఖీ చేశామన్న మంత్రి, పట్టుకున్న బియ్యంలో 25 వేల టన్నులు రేషన్ బియ్యంగా గుర్తించామన్నారు. ఐదేళ్లపాటు కాకినాడ పోర్టులోకి ఎవరినీ రానివ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ పోర్టులోకి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. డోర్ డెలివరీ పేరుతో 9 వేలకు పైగా వ్యాన్లు కొని, సరఫరా వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం సేకరించారని ఆరోపించారు. రేషన్ బియ్యం తరలించడంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేశారని ధ్వజమెత్తారు.
అరబిందోకు అసలైన బాస్ ఎవరు?: విశాఖ, గంగవరం, కృష్ణపట్నం కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతి జరుగుతోందని, కాకినాడ పోర్టు నుంచి మూడేళ్లలో కోటీ 31 లక్షల టన్నులు ఎగుమతి జరిగిందని తెలిపారు. కాకినాడలో మూడేళ్లలో చేసిన బియ్యం ఎగుమతి విలువ రూ.45 వేల కోట్లు అని వెల్లడించారు. భారీగా ఎగుమతులు జరిగాయి కనుకే కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టి పెట్టామని, కాకినాడ పోర్టులోకి అరబిందో రియాలిటీ ఎలా వచ్చిందో జగన్ చెప్పాలని నిలదీశారు. బెదిరించి మరీ 41 శాతం వాటా రాయించుకున్నారని, అరబిందోకు అసలైన బాస్ ఎవరో చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ జవాబు చెప్పాలి: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా చూస్తామని మంత్రి తెలిపారు. కాకినాడ పోర్టుపై వస్తున్న ప్రశ్నలకు జగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అరబిందో రియాలిటీకి ఎలా దక్కిందో సమగ్ర దర్యాప్తు జరగాలని, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని మరీ రేషన్ బియ్యం తరలించారని ఆరోపించారు. మిగతా పోర్టుల కంటే కాకినాడ నుంచే ఎక్కువ ఎగుమతులు జరిగాయని,కరోనా సమయంలోనూ కాకినాడ నుంచే బియ్యం భారీగా ఎగుమతి జరిగిందని అన్నారు. వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకుని బియ్యం ఎగుమతి చేశారని వెల్లడించారు.
ద్వారంపూడి, కన్నబాబు గతంలో ఎందుకు మాట్లాడలేదని మంత్రి ప్రశ్నించారు. పూర్తిగా పాతుకుపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే తనిఖీలు చేస్తున్నామని, రైస్ మిల్లులనూ గుప్పిట్లో ఉంచుకుని రేషన్ బియ్యం వ్యాపారం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాకినాడ పోర్టు కోసం కేవీరావు కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ మాఫియా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు పవన్ చేసిన ప్రయత్నం గొప్పదని కొనియాడారు.
బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్
ప్రభుత్వ వ్యవస్థలు పతనం! - కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలుతున్న సరుకు