Lokesh Meet with senior officials Education Department: రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరుశాతం, విద్యాప్రమాణాల మెరుగుదల కోసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి లోని తన నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
'సౌదీలో ఇబ్బందులు పడుతున్నా-రక్షించండి' - మంత్రి లోకేశ్‌కు మహిళ విజ్ఞప్తి
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం : పదోతరగతి పూర్తిచేసిన పేద విద్యార్థుల్లో డ్రాపౌట్స్ ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా దానిని కొంతమేర తగ్గించే అవకాశం ఉందని లోకేశ్ చెప్పారు. ఇంటర్మీడియట్లో వెనుకబడిన విద్యార్థులకు ప్రశ్న బ్యాంకు అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల ఎసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ వారికి పర్యవేక్ష కులుగా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు.
డిసెంబర్ 7 న మెగా పేరెంట్-టీచర్ సమావేశం : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిసెంబర్ 7వతేదీన నిర్వహించే మెగా పేరెంట్-టీచర్ సమావేశాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలకు హాజరుకావాలన్నారు. ఎటువంటి పార్టీ జెండాలు, హంగు, ఆర్భాటాలకు తావీయొద్దని స్పష్టంచేశారు. బాపట్ల ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించే మెగా పిటిఎం నిర్వహణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు తాను కూడా హాజరుకానున్ననట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పన ప్రధాన లక్ష్యంగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం 18 అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. 10వతరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగుపర్చేందుకు 100రోజుల ప్రణాళికను అమలు చేయాలన్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి కేజీ టు పీజీ కరిక్యులమ్ ప్రక్షాళనపై సమావేశంలో లోకేశ్ చర్చించారు.
'లోకేశ్ బాగా పని చేశావు' - చంద్రబాబు అభినందనలు
నైతిక విలువలు గల పాఠ్యాంశాల కోసం చాగంటి సలహాలు : విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో లైఫ్ స్కిల్స్, సామాజిక బాధ్యత పెంపొందించేలా పాఠ్యాంశాలు రూపొందించాలన్నారు. విద్యార్థులకు జపనీస్ మోడల్ లైఫ్ స్కిల్స్ ను అలవర్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన జిఓ 117ను రద్దుచేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెరుగైన విధానం అమలుకు గ్రామస్థాయిలో అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. ఈ సమావేశాలకు స్కూలు యాజమాన్య కమిటీలను సైతం ఆహ్వానించాలని నిర్ణయించారు.
మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు - వయో పరిమితిపై లోకేశ్ ఏమన్నారంటే!