Minister Lokesh Attended CII Southern Regional Council Meet: రాష్ట్రం అభివృద్ధి కోసం భారత పరిశ్రమల సమాఖ్యతో కలిసి ప్రభుత్వం పని చేస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేసారు. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు అవకాశాలు ఉన్నాయన్నారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్‌పై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. వేగంగా అనుమతులు, యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబు నాలుగో దఫా పని చేస్తున్నారని మానవ వనరులను కూడా నైపుణ్యం ఉండేలా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. ఐటీ, డేటా సెంటర్లు, ఏఐ లాంటి సాంకేతికతల కేంద్రంగా విశాఖను తీర్చి దిద్దుతామన్నారు.
20 లక్షల మందికి ఉద్యోగాలు: అనంతపురంలో సంప్రదాయేతర ఇంధన వనరుల, ప్రకాశంలో బయో ఫ్యూయల్ ఎనర్జీ, పశ్చిమ తూర్పు గోదావరిలో ఆక్వా పరిశ్రమలు, విశాఖలో ఐటీ, ఫార్మా కంపెనీలు ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తామని మంత్రి లోకేశ్ వివరించారు. ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అది మా సూపర్ 6 హామీల్లో ఒకటి అని వెల్లడించారు. చంద్రబాబు పాలన వ్యవహారాలు, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహం గురించి కొత్తగా పారిశ్రామిక వేత్తలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. నెల రోజుల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి పెట్టుబడుల కోసం మీ వద్దకే వస్తామని లోకేశ్ అన్నారు.
నైపుణ్యం ఉన్న మానవ వనరులు కూడా రాష్ట్రంలో సిద్ధంగానే ఉన్నారని లోకేశ్ తెలిపారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు రాష్ట్రానికి అనుకూలమైన అంశమని మంత్రి లోకేశ్ వెల్లడించారు. సాంకేతికతను అనుసంధానించి తక్కువ వ్యయంతో వ్వవసాయం లాభసాటిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. మామిడి, డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం లాంటి ఉత్పత్తులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. జపాన్, అమెరికా, యూరప్ లాంటి దేశాలకు ఎగుమతి చేయొచ్చని లోకేశ్ తెలిపారు.
పెట్టుబడులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు: పరిశ్రమల ఏర్పాటుకు శాశ్వతంగా ఒక ఎకో సిస్టం ఉండాలని, అప్పుడే పెట్టుబడులు సుస్థిరంగా వచ్చే అవకాశం ఉంటుందని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లోని జెనోమ్ వ్యాలి, ఐటీ కారిడార్లు గతంలో ఏర్పాటు అయ్యాయని, వాటికి రాజకీయాలతో, ప్రభుత్వాలతో సంబంధం ఉండదని తెలిపారు. అలానే రాష్ట్రంలో ఏర్పాటు అయిన కియా లాంటి పరిశ్రమలు కూడా అలాంటివేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంప్రదాయేతర విద్యుత్ పీపీఏలు రద్దు కావడం రాష్ట్రానికే కాదు యావత్ దేశంపైన ప్రభావం పడిందని విమర్శించారు. పెట్టుబడులకు ఇలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు తమ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేస్తోందన్నారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు.
హౌస్ అరెస్టులు, గేట్లకు తాళ్లు కట్టే ప్రభుత్వం మాది కాదు: గత ఐదేళ్లలో పరిశ్రమల రంగం ఇబ్బందులు ఎదుర్కోందని ఆయన ఆక్షేపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పదేపదే మార్చకుండా ఓ చట్టం తీసుకురావాలని కేంద్రంతో మాట్లాడతామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలాగా సీక్రెట్ జీవోలు ఇవ్వటం లేదని ప్రతీ అంశాన్ని ప్రజలముందు ఉంచుతున్నామన్నారు. గతంలో హౌస్ అరెస్టులు, గేట్లకు తాళ్లు కట్టే ప్రభుత్వం మాది కాదన్నారు. చంద్రబాబు పరదాలు కట్టుకుని తిరిగే సీఎం కాదన్నారు. లడ్డూ ప్రసాదంలో అపవిత్ర పదార్ధాలు కలిపిన వ్యవహారంలో మా సవాలు వైసీపీ నేతలు ఎందుకు స్వీకరించలేదని లోకేశ్ ప్రశ్నించారు. 24 గంటలపాటు తిరుపతిలోనే ఉన్నాను, మరి చర్చకు ఎందుకు రాలేకపోయారో వాళ్లే చెప్పాలన్నారు.