Atchannaidu Review Meeting Flood Damage : ఏపీలో వ్యవసాయ, ఉద్యాన, మత్స్య శాఖ, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, విజయవాడ వరద సహాయక చర్యలపై ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారుల నివాస ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేట పూర్తిగా నిషేధించి మత్స్యకారులను వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా మత్స్యకారుల బోట్లను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో 1.81 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశామని అధికారులు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అత్యధికంగా 1.39 లక్షల హెక్టార్లలో వరి పంట నష్టం జరిగిందన్నారు. 113 మండలాల్లో 197 బృందాలు, 131 పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 16,044 పశువులకు వైద్య సేవలు అందించామని తెలిపారు. 21,857 పశువులు, గొర్రెలు, మేకలకు వ్యాక్సినేషన్ చేశామని అధికారులు మంత్రికి వివరించారు.
బుడమేరు వరద, వర్ష బీభత్సం ఉన్న ఆరు జిల్లాల్లో 286 పశువుల కళేబరాలు తొలగించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు మంత్రికి తెలిపారు. 3449 హెక్టార్లలో మత్స్య సాగుపై వరద, అధిక వర్షాల ప్రభావం పడిందని ప్రాథమిక అంచనా వేసినట్లు చెప్పారు. రూ.141 కోట్ల మేర మత్స్య సంపదకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో అధిక శాతం నష్టం జరిగిందన్నారు.
AP Flood Damage 2024 : 320 మత్స్యకారుల బోట్లు పూర్తిగా, 61 బోట్లు పాక్షికంగా, 257 వలలు దెబ్బతిన్నాయని అచ్చెన్నాయుడికి అధికారులు వివరించారు., అదేవిధంగా ఆరు జిల్లాల్లో మత్స్య సాగు చేసే చెరువులు వరదల వల్ల భారీగా ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే వరద సహాయక చర్యలు వేగవంతం చేయడంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అచ్చెన్నాయుడు తెలిపారు. నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
వరదల వల్ల రాష్ట్రంలో లక్షన్నర లక్షల హెక్టార్లలో పంటనష్టం: అచ్చెన్నాయుడు - Floods Damage in AP