Minister Anagani Satya Prasad on Lands Issue : మదనపల్లె సబ్‌కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనలో కుట్రకోణం దాగి ఉందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియా సమావేశంలో మంత్రి అనగాని వివరాలు వెల్లడించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో గతంలో పని చేసిన ఆర్డీఓ మురళీ, ప్రస్తుత ఆర్డీఓ హరి ప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌లను ఈ ఘటనలో సస్పెండ్ చేశామని వెల్లడించారు. వచ్చే వారం కూడా సీఎం ఈ అంశాలపై సమీక్ష చేస్తామని చెప్పారని తెలిపారు.
మదనపల్లె ఘటనలో ఎంతటి వారున్నా శిక్షార్హులే మంత్రి అనగాని స్పష్టx చేశారు. అన్ని ప్రాంతాలకు వెళ్లి భూ అక్రమాల ఫిర్యాదులు తీసుకుంటామని, సమయం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవన్నారు. గతంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూములపై సమీక్షిస్తామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టును పరిశీలించాల్సింగా సూచనలు చేశారన్నారు.
ఐదేళ్లలో భూ అక్రమాలు భారీగా జరిగాయని మంత్రి ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన భూములు వెనక్కు తీసుకునే అవకాశం కూడా పరిశీలిస్తున్నామన్నారు. రూ.కోట్ల విలువైన భూములను లక్షల రూపాయలకే కేటాయిస్తారా అని మంత్రి ప్రశ్నించారు. గతంలో వైఎస్సార్సీపీ నేతల చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉన్నారని విమర్శించారు. రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేని పరిస్థితి ఉండేదన్నారు.
రెవెన్యూశాఖ కార్యదర్శి మూడు రోజుల పాటు మదనపల్లెలోనే ఉన్నారని, మదనపల్లె ఘటనపై అధ్యయనం చేసి సీఎంకు నివేదిక ఇచ్చారని తెలిపారు. మదనపల్లెలో జరిగిన అన్యాయాలపై ప్రజలు ఫిర్యాదు చేశారన్న అనగాని, ముగ్గురు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చామన్నారు. అసైన్డ్ భూముల సమస్యలపై కూడా రెవెన్యూశాఖ అధ్యయనం చేస్తోందని, ఎన్ని భూములు 22ఏ కింద ఉన్నాయి, ఎన్ని తొలగించారనేది పరిశీలించాలన్నారు.
మదనపల్లె దస్త్రాల దహనం కేసు- ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్ వేటు - Madanapalle Fire Accident Case
క్యూఆర్ కోడ్‌తో కొత్త పాసు పుస్తకాలు: వైఎస్సార్సీపీ హయాంలో భారీగా భూపందేరాలు చేశారని, ప్రైవేటు వ్యక్తులకు భూములు దోచిపెట్టారన్నారు. దోచిపెట్టిన భూములు వెనక్కి తీసుకోవడంపై సమీక్ష జరిగిందని, భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. సర్వే రాళ్లపై బొమ్మల పిచ్చిపైనా సీఎం సమీక్ష చేశారని మంత్రి అనగాని తెలిపారు. 77 లక్షల సర్వే రాళ్లు ఉన్నాయని, వాటిపై పేర్లు తీయడానికి కూడా 15 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. రీ సర్వేపై వివాదాలు పరిష్కారం అయ్యాక, కొత్త పాస్ పుస్తకాలు కూడా జారీ చేయమని సీఎం చెప్పారని అన్నారు. క్యూఆర్ కోడ్‌తో కొత్త పాసు పుస్తకాల తయారీ జరుగుతోందన్నారు.
అధికార లోగో ఉండేలా పాస్ పుస్తకాలు జారీ చేస్తామన్నారు. దీనికి 20 కోట్లు వ్యయం అవుతుందని తెలిపారు. మదనపల్లి ఫైల్స్‌పై దృష్టి పెట్టి, మరింత లోతుగా విచారణ జరుగుతోందన్నారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా పర్యటిస్తారని తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల కు వెళ్లి భూ అక్రమాల ఫిర్యాదులు తీసుకుంటామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొందరు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూముల పైనా సమీక్ష చేస్తామన్నారు. కోట్ల విలువైన భూములు లక్షల రూపాయలకు కేటాయిస్తారా అని మండిపడ్డారు. అసైన్డ్ భూముల చట్టం వల్ల రాజకీయ నేతలే లబ్ధి పొందారని అన్నారు. ప్రచార పిచ్చి కోసం 650 కోట్లు పెట్టి సర్వే రాళ్ల కొనుగోలు చేసి, ప్రజా ధనం వృథా చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు.