Mines Department Officials are Destroying Lease Records: జగన్ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని గనులశాఖ కీలక అధికారి ధీమాగా ఉండేవారు. కూటమి ప్రభంజనంతో ఆయన షాక్ తిన్నారు. వెంటనే మంగళవారం మధ్యాహ్నమే పలు దస్త్రాలను తన ఇంటివద్దకు తెప్పించుకొని అందులో నోట్‌ఫైల్ వివరాలను మాయం చేసినట్లు గనులశాఖలో చర్చ జరుగుతోంది. బుధవారం కూడా మరిన్ని ఫైళ్లు తెప్పించుకొని పరిశీలించారని సమాచారం. ఇందుకు గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో విధులు నిర్వహించే కొందరు అధికారులు, ఉద్యోగులు సహకరించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం విచారణ చేపడితే దొరికిపోతామనే అనుమానం ఉన్న దస్త్రాల్లోని నోట్ ఫైళ్లలో వివరాలు మాయం చేశారని సమాచారం. ఏపీఎండీసీకి చెందిన పలు టెండర్ల దస్త్రాలనూ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.
గనులశాఖలో కీలక అధికారి మొన్నటి వరకు లీజుదారులకు చుక్కలు చూపించారు. కొత్త లీజుల మంజూరు, గడువు ముగిసినవాటికి రెన్యువల్స్ తదితరాల్లో చేతివాటం చూపారు. అధికారపార్టీ వర్గీయులకు ఇష్టానుసారం లీజులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. 2022 జూన్ నుంచి ఈ-వేలం విధానంలో లీజుల కేటాయింపు విధానం తీసుకొచ్చారు. అంతకుముందు తొలుత దరఖాస్తు చేసినవారికి మొదట లీజు కేటాయింపు అనే విధానం ఉండేది. ఈ-వేలం వచ్చాక, ప్రతి లీజుకూ ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించాలి. కానీ వైఎస్సార్సీపీ చెందిన కొందరికి పాత తేదీలతో లీజులు కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి.
లీజులు పొందిన కొందరికి తుది అనుమతులు ఇవ్వకుండా వేధించారు. మైనింగ్‌ప్లాన్, పర్యావరణ అనుమతి , కాలుష్య నియంత్రణ మండలి నుంచి కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనుమతులు తెచ్చుకున్నా వారికి అనుమతులు ఇవ్వలేదు. ఇలా దాదాపు వందకు పైగా లీజుల దస్త్రాలు పెండింగ్‌లో ఉంచారు. మంత్రిని ప్రసన్నం చేసుకుంటేనే తుది అనుమతులు ఇస్తామంటూ ఆ లీజులన్నీ ఆపేసినట్లు తెలిసింది. పాత లీజుల రెన్యువల్స్‌కూ ఇలాగే వేధించినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం వీటిపై సమగ్ర విచారణ జరిపితే లోగుట్టు అంతా బయటకు వస్తుందనే వాదన వినిపిస్తోంది.
చక్రం తప్పిన మంత్రి: రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో సీనరేజి వసూలు చేస్తున్న గుత్తేదారులు సర్దుకుంటున్నారు. తెలంగాణకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఉమ్మడి చిత్తూరు, విజయనగరం జిల్లాల సీనరేజి వసూళ్ల టెండరు గతంలో దక్కించుకుంది. అదే కుటుంబానికి చెందిన హిల్‌సైడ్ ఎస్టేట్స్ సంస్థ ఉమ్మడి కడప జిల్లా టెండరు దక్కించుకుంది. ఇందులో ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో సీనరేజి వసూళ్లను రాయలసీమలో చక్రం తప్పిన, గత ప్రభుత్వంలో నంబర్-2గా వ్యవహరించిన కీలక మంత్రే నిర్వహించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో అమిగోస్ మినరల్స్ సంస్థ టెండరు దక్కించుకోగా, ఇది కూడా నంబర్-2 మంత్రికి సన్నిహితులదే. ఉమ్మడి గుంటూరు జిల్లా టెండరును తెలంగాణకు చెందిన ఏఎంఆర్ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థలు లీజుదారులకు నకిలీ పర్మిట్లు జారీ చేశాయనే ఆరోపణలు ఉన్నాయి. గనులశాఖకు లెక్క చూపకుండా ఉండేందుకు నకిలీ పర్మిట్లు ఇచ్చారని తెలుస్తోంది.
ఇక అమరావతికి కొత్త కళ - యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు - CRDA Started Work in Capital
చేతిరాతతో పర్మిట్లు: గతంలో గనులశాఖ ద్వారా లీజుదారులకు ఆన్‌లైన్‌లో పర్మిట్లు జారీచేస్తే సీనరేజి వసూళ్ల గుత్తేదారులు వచ్చాక ఆఫ్‌లైన్‌లో చేతిరాతతో పర్మిట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. నకిలీ పర్మిట్ల జారీకోసమే ఇలా వీలు కల్పించారని తెలుస్తోంది. ప్రతినెలా ప్రభుత్వానికి సొమ్ము చెల్లించకపోయినా, జారీచేసిన పర్మిట్ల వివరాలను గనులశాఖ అధికారులకు అందించకపోయినా ఎవరూ ప్రశ్నించలేదు. అనంతపురం జిల్లా గుత్తేదారు ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల తరఫున ఓటర్లకు డబ్బుల పంపిణీలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి ఆయా జిల్లాల్లో సీనరేజి వసూళ్ల గుత్తేదారులు పర్మిట్ల జారీ ఆపేశారు. దీంతో చాలాచోట్ల లీజుదారులు పర్మిట్లు తీసుకోకుండా రోడ్ మెటల్, మట్టి, కంకర తరలిస్తున్నారు. ఇలాంటిచోట వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన గనులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు ప్రమాణస్వీకారం - Union Ministers From AP