Massive Theft on Hubballi Vijayawada Express : కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ దొంగతనం జరిగింది. శనివారం ఉదయం (Sep 28) 2.5 కోట్ల రూపాయలు విలువైన 3.5 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్, రంగారావు సత్తెనపల్లిలో ‘సాయిచరణ్ జ్యువెలర్స్’ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్నారు. వీరు తయారు చేసిన ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విక్రయిస్తుంటారు.
ఈ క్రమంలోనే రంగారావు, ఆయన సోదరుడు సతీశ్‌బాబుతో కలిసి బంగారు ఆభరణాలను తీసుకొని మంగళవారం రాత్రి (Sep 24న) సత్తెనపల్లి నుంచి బళ్లారి వెళ్లారు. మూడు రోజుల పాటు బళ్లారిలో ఉండి పలు దుకాణాల వ్యాపారులను సంప్రదించారు. వారి ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో శుక్రవారం రాత్రి (Sep 27న) హుబ్బళ్లి-విజయవాడ రైలులో తిరుగు పయనం అయ్యారు.
నిద్రలేచే సరికి బ్యాగ్ మాయం : నంద్యాల వరకు రంగారావు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత ఆభరణాలున్న బ్యాగును ఆయన తన తల కింద పెట్టుకొని నిద్రపోయారు. రైలు దొనకొండ సమీపానికి వచ్చే ముందు మెలకువ వచ్చి బ్యాగును చూడగా అది కనిపించలేదు. దీంతో అప్రమత్తం అయిన రంగారావు వెంటనే రైలు దిగి దొనకొండ రైల్వే స్టేషన్‌కు శనివారం ఉదయం (Sep 28న) ఏడు గంటల సమయంలో వెళ్లారు. అక్కడ రైల్వే పోలీసులు ఎవరు లేరు. స్థానికుల సమాచారం ద్వారా అక్కడి పోలీసులు మార్కాపురం వెళ్లాలని తెలుసుకొని అక్కడికి వెళ్లారు.
జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa
స్పందించని రైల్వే పోలీసు సిబ్బంది : అక్కడి వారు నరసరావుపేట వెళ్లాలని చెప్పారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్వే పోలీసులను కలిశారు. అక్కడి రైల్వే పోలీసులు రంగారావును సాయంత్రం వరకు రకరకాల ప్రశ్నలు అడిగారు. చివరికి దొంగతనం జరిగిన ప్రాంతం నంద్యాల రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని వెల్లడించారు. రంగారావును అక్కడి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమని సూచించారు. దీంతో వారు రాత్రి నరసరావుపేట నుంచి బయలుదేరి నంద్యాల రైల్వే పోలీసుల వద్దకు చేరుకున్నారు. చోరీ జరిగిందని బాధితులు తెలిసినా, పోలీసులు కనీసం దొంగలను పట్టుకునేందుకు వెంటనే స్పందించలేదు. కనీసం కేసు నమోదు చేయలేదు. రైల్వే పోలీసులు పరిధి పేరుతో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
'మహిళా దొంగలు మాయ చేశారు'- 'ఏటీఎం ధ్వంసం చేసి 29లక్షలు చోరీ' - Theft Cases in AP