Many Farmers are Committing Suicide due to Land Issues : ఉమ్మడి అనంతపురం జిల్లాలో భూ సమస్యలు పరిష్కారం కాక ఆవేదనతో అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భూ సమస్య పరిష్కరించాల్సిన కొందరు తహసీల్దార్లే వివాదాలను సృష్టిస్తున్న పరిస్థితి నెలకొంది. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన అనేక భూ సమస్యలను జిల్లా కలెక్టర్ వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల స్వీకరణ వేదికకు వందలాదిగా బాధిత రైతులు భూ సమస్యలతోనే వస్తున్నారు. సమస్య పరిష్కారానికి కలెక్టరేట్ల నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు వెళ్లినా పట్టించుకోవడం లేదు. కొంతమంది తహసీల్దార్లు సమస్యను పరిష్కరించకపోగా బాధితులను బెదిరిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సమస్యలను పరిష్కరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు ప్రాణాలు తీసుకోడానికి సైతం సిద్ధపడుతున్న పరిస్థితి నెలకొంది.
అర్జీలు పట్టుకొని తిరగాల్సిన పరిస్థితి : భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా ఆదేశాలిచ్చినా ఆమేరకు చిత్తశుద్ధి మండలస్థాయి రెవెన్యూ అధికారుల్లో కనిపించడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అనేక మండలాల్లో రికార్డులను తారుమారు చేసి అమాయకమైన రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఎన్నో సంఘటనలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చాయి. గత ప్రభుత్వంలో భూ సమస్యల పరిష్కారం కోసం అప్పటి స్పందనలో కలెక్టర్లకు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏ రోజూ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిష్కరించలేదు. సమస్యను పరిష్కరించకుండానే బాధితులకు న్యాయం చేశామని రికార్డుల్లో రాసుకొని గ్రీవెన్స్ ను మూసేసిన బాధ్యతరాహిత్య పరిస్థితులు కూడా బాధిత రైతులు చూడాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో చేసిన పాపాలతో నేటికీ రైతులు కలెక్టర్ల చుట్టూ అర్జీలు పట్టుకొని తిరగాల్సి వస్తోంది.
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం- త్వరలో మ్యాపింగ్ సిద్ధం: ఆర్పీ సిసోదియా - visakha land issues
బలవంతుడి పక్షాన నిలబడుతున్నారు : గ్రామాల్లో తలెత్తే భూ సమస్యల్లో 70 శాతంపైగా తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం చేయగలుగుతారు. అయితే వివాదాన్ని రెవెన్యూ అధికారులే మరింతగా పెంచుతూ, బలవంతుడి పక్షాన నిలబడుతున్నారనే విమర్శులున్నాయి. అన్నదమ్మల మధ్య భూ వివాదాలు, వ్యవసాయ క్షేత్రాలకు దారి సమస్యలు, సరిహద్దు వివాదాలు ఇలాంటివన్నీ తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉంది. సమస్య పరిష్కారం చేయడానికి సిద్ధపడని చాలా మంది తహసీల్దార్లు రికార్డులు లేవని, అగ్నిప్రమాదంలో కాలిపోయాయని కుంటిసాకులు చెబుతూ బాధితుల సంఖ్యను పెంచుతున్నారు.
సమస్యలు పరిష్కారం కావడంలేదు : కలెక్టర్ వద్దకు వస్తున్న ఫిర్యాదుల్లో 40 శాతం మేర తహసీల్దార్లు చేస్తున్న తప్పుల వల్ల బాధితులుగా మిగిలిపోయిన వారివే ఉంటున్నాయి. రాత్రికి రాత్రి భూ యాజమాన్య హక్కులను మార్చేయడం, అక్రమంగా మరొకరికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం వంటి అనేక అక్రమాలు గత ఐదేళ్లలో వందలాదిగా వెలుగుచూశాయి. రెవెన్యూ రికార్డులనే మార్చేస్తున్న కొందరు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోందనే విమర్శలున్నాయి. సంవత్సరాల తరబడి కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మా తాతల కాలం నుంచి ఉన్న సొంత భూమికి రిజిస్ట్రేషన్ అయ్యింది. దానికి సంబంధించిన పాస్ పుస్తకం కూడా ఉంది. కానీ ఆన్ లైన్లో చిన్న పొరపాటు జరిగింది. దీని కోసం 20 సార్లు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగాను. ఇప్పటికీ సమస్య పరిష్కరం కాలేదు. కొంత మంది అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యానికి విసిగిపోయి రైతులు ప్రాణాలు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు." - శ్రీనివాస్, బాధిత రైతు
పురుగుల మందు తాగి ఆత్మహత్య : సమస్యను పరిష్కరించాల్సిన రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోగా, రైతులను తిప్పుకోవడంతో విసిగిపోతున్న బాధితులు ఆర్థికంగా చితికిపోయి కలెక్టరేట్ల ఎదుటే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గార్లదిన్నె మండలానికి చెందిన రైతు సూర్యనారాయణకు అన్నదమ్ములతో భూ వివాదం తలెత్తగా పరిష్కారం చేసే అవకాశం ఉన్నా తహసీల్దార్ పట్టించుకోలేదు. దీంతో రైతు సూర్యనారాయణ అనంతపురం కలెక్టరేట్ కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్యకు జిల్లా కలెక్టర్ లక్ష రూపాయలు పరిహారం పంపించారు కానీ, బతికుండగా తహసీల్దార్ సమస్యను పరిష్కరించలేదు. సూర్యనారాయణ మృతి అనంతరం ఆయన సోదరులను పిలిపించి కలెక్టర్ ఆదేశాలతో తహసీల్దార్ భూ సమస్యను పరిష్కరించారు.
పెట్రోల్ పోసుకొని నిప్పుపెట్టుకునే ప్రయత్నం : తాజాగా ఈరోజు పుట్టపర్తి మండలానికి చెందిన రైతు దస్తగిరి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయి శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో ప్రాణం కాపాడినట్లైంది. అధికారుల అవినీతి, బాధ్యతా రాహిత్యానికి బాధిత రైతులు ప్రాణాలు తీసుకోడానికి సిద్ధమవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయాలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, ఇప్పటికే చాలా మందిని దూర ప్రాంతాలకు బదిలీలు చేశామని భూ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రణాళిక చేసినట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ చెబుతున్నారు.
"చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తరువాత అయినా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వందలాది రైతులు కలెక్టరేట్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. మండల స్థాయి రెవెన్యూ అధికారుల్లో బాధ్యతను పెంచితే తప్ప భూ సమస్యలకు పరిష్కారం జరగటం లేదు. ఇప్పటికే చాలా మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాబోయే రోజుల్లో ఏ మండలాల్లో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయో స్వయంగా జాయింట్ కలెక్టర్ అక్కడికే వెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. విధి నిర్వహణలో నిర్ణక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం." - డా.వినోద్ కుమార్, అనంతపురం జిల్లా కలెక్టర్
200 కోట్ల విలువైన దళితుల భూములపై స్థిరాస్తి వ్యాపారి కన్ను - తెర వెనక ప్రజాప్రతినిధులు !