Notices to Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావాలని అందులో వివరించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేశారు.
లుక్‌అవుట్ నోటీసులు జారీ : వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. దీనిపై కేసు నమోదు కావడంతో ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జల ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు ఆయన విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు.
సజ్జలపై సర్య్కులర్ - ముంబయి విమానాశ్రయంలో ఆపిన అధికారులు
టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వైఎస్సార్సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురామ్‌లను ఇప్పటికే ఫలు దఫాలుగా పీఎస్‌కు పిలిపించి విచారించారు. కేసు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో దాడి ఘటనలో ప్రమేయం ఉన్న ముఖ్య నాయకులను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సజ్జలకు నోటీసులు జారీ చేశారు.