Polavaram Main Dam Water Transfer : గోదావరిలో వరద తగ్గడంతో అధికారులు పోలవరం ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని ఖాళీ చేస్తున్నారు. దిగువ కాఫర్ డ్యాం చివర్లో నిర్మించిన డిప్లీటింగ్ స్లూయిస్ ద్వారా ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ఉన్న ప్రాంతమే ప్రధాన డ్యాం నిర్మించాల్సిన ప్రదేశం. ఇక్కడే డయాఫ్రం వాల్ ఉంటుంది. ఇప్పుడు కొత్త డయాఫ్రం వాల్‌నూ ఇక్కడే నిర్మించాలి.
International Experts Team on Polavaram : ప్రస్తుతం ఆ ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం అంతా సీపేజి నీటితో నిండిపోయి ఉంది. దీంతో పనులు చేసుకునేందుకు ఇబ్బందిగా మారింది. ఈమధ్య పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం సందర్శించింది. ఆ నిపుణులు సైతం ఎగువ కాఫర్ డ్యాం సీపేజిని నిరోధించడం అంత సులభమైన అంశంగా పేర్కొనలేదు. అక్కడ ఉన్న నీటిని ఎత్తిపోసుకుంటూ పనులు చేసుకోవడమే మార్గమన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఇంకా వారినుంచి తుది నివేదిక రాలేదు.
డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మాణం : ప్రధాన డ్యాం ప్రాంతంలో నీటిని ఎత్తిపోయాలంటే రూ.కోట్ల అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలోనే పోలవరం ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు దిగువ కాఫర్ డ్యాం చివరన ఒక కొండను ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని తవ్వారు. అక్కడ డిప్లీటింగ్ స్లూయిస్ తరహాలో ఒక నిర్మాణాన్ని చేపట్టారు. ఆ స్లూయిస్ తలుపులు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తుంటారు. అదేవిధంగా వరద లేనప్పుడు ప్రధాన డ్యాం ప్రాంతంలో ఉన్న నీటిని స్లూయిస్ తలుపులు తెరిచి దిగువకు వదిలేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల గ్రావిటీ ద్వారా నీరు గోదావరిలో కలిసిపోతుంది.
అప్పట్లో కేంద్రజలసంఘం, కేంద్ర జల్‌శక్తి అధికారులు ఈ నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదు. వారి పర్మిషన్ లేకుండా ఈ స్లూయిస్ నిర్మిస్తున్నందుకు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డిప్లీటింగ్ స్లూయిస్ నిర్మించి రెండు గేట్లను ఏర్పాటు చేశారు. ఎగువ కాఫర్ డ్యాంకు ఎగువన ప్రస్తుతం నీటిమట్టం 29 మీటర్లు ఉంది. దిగువ కాఫర్ డ్యాంకు దిగువన నీటిమట్టం 19 మీటర్లుగా ఉంది. రెండు డ్యాంల మధ్య సీపేజి నీరు ఉన్న ప్రాంతంలో నీటిమట్టం 23 మీటర్లు ఉంది. అందువల్ల డిప్లీటింగ్ స్లూయిస్‌లో ఒక తలుపు తెరిచి నీటిని దిగువకు వదలడం సులభమవుతోంది. ప్రధాన డ్యాం ప్రాంతంలో 0.35 టీఎంసీల నీరు ఉండొచ్చని అంచనా.
నివేదిక వచ్చాక తదుపరి ప్రక్రియ : మరోవైపు విదేశీ నిపుణుల బృందం నుంచి నివేదిక ఒకట్రెండు రోజుల్లో రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి మొగ్గుచూపింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ సైతం కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించి కేంద్రానికి పంపింది. ఈ నివేదిక వచ్చాక తదుపరి ప్రక్రియ ప్రారంభం కానుంది.