Madanapalle Case Handed Over to CID: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దస్త్రాలు దహనం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈమేరకు డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 21వ తేదీన జరిగిన ఘటనపై ఇప్పటివరకు మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులపై 9 కేసులు నమోదు చేశారు. వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంతం అయినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.
సోమవారం కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రెవెన్యూ భూముల వ్యవహారం గురించి సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో ప్రస్తావించడంతో పాటు, ఈ ఘటనపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. మదనపల్లె ఘటనను ప్రస్తావించిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలరావు కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతనెల 21వ తేదీ రాత్రి 11.30 గంటలకు అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ దస్త్రాలు దహనం చేశారు.
దాదాపు 580 వరకు ఫిర్యాదులు: ఘటనను తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే హెలికాప్టర్లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆదేశించడంతో, ఆయన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దస్త్రాలు దహనంలో కుట్రకోణం దాగి ఉందని, షార్ట్ సర్క్యూట్ కాదని అధికారుల నివేదికలు తేల్చాయి. దీంతోపాటు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోదియా మూడు రోజుల పాటు మదనపల్లెలో మకాం వేసి బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దాదాపు 580 వరకు ఫిర్యాదులు అందాయి. అవన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బలవంతంగా లాక్కున్న భూములు, స్థలాలే 70 శాతం పైగానే ఉన్నాయని అధికారులు గుర్తించారు.
దాదాపు 2400 దస్త్రాలు కార్యాలయంలో దహనం కాగా, పాక్షికంగా కాలిపోయిన 700 దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయంలో జులై 10వ తేదీ నుంచి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని గుర్తించారు. ఈ వ్యవహారంలో భారీ కుట్ర దాగి ఉందని పోలీసు, రెవెన్యూశాఖ సమాంతరంగా జరిపిన విచారణలో వెల్లడైంది. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు బాధితులను వేధించి దౌర్జన్యంగా భూములు, స్థలాలు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. బాధితులంతా సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి మొర పెట్టుకున్నారు. కొందరు మహిళలు తమ పుస్తెలతాడు తెంపేశారని కన్నీరు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.
కీలక దశకు మదనపల్లె ఫైళ్లు దహనం కేసు - వైఎస్సార్సీపీ నేతల కీలక పాత్ర - madanapalle fire accident case
వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు: ఈ ఘటన వెనకు భారీ కుట్ర ఉందనే అభిప్రాయంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఆర్డీవోలు మురళీ, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్, వీఆర్ఏ రమణయ్యలను వారం రోజుల పాటు ప్రశ్నించారు. ఎట్టకేలకు వారి ప్రమేయం ఉందని సిసోదియా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో, ఆర్డీవోలు మురళీ, హరిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక పోలీసులు తనిఖీల సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు అక్రమంగా దాచుకున్న రెవెన్యూ దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో అనుమానం ఉన్న నాయకులపై కేసులు నమోదు చేశారు.
పలువురిపై 9 కేసులు నమోదు: పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిపై కేసు నమోదు చేశారు. మదనపల్లె వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే నవాబ్ బాషా, మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకటచలపతి, మిథున్ రెడ్డి అనుచరుడు, స్మగ్లర్ బాబ్ జాన్, పెద్దిరెడ్డి పీఏలు శశిధర్, తుకారం, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌లపై విడివిడిగా 9 కేసులు నమోదు అయ్యాయి. కేసు బలంగా ఉండాలనే ఉద్దేశంతో అనుమానితులుగా ఉన్న వైఎస్సార్సీపీ నాయకులపై విడివిడిగా కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా పది బృందాలు ఈ కేసులో అనుమానితుల కోసం గాలిస్తున్నాయి.
లోతుగా విచారణ చేయనున్న సీఐడీ: ఇప్పటికే రెండు దఫాలుగా సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెకు వచ్చి కేసు పురోగతిని వారం కిందటే వచ్చి సమీక్షించి వెళ్లారు. ఇపుడు మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీఐడీ అధికారులు దృష్టి సారించే వీలుందని తెలుస్తోంది. మరోవైపు ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అధికారులను అడ్డం పెట్టుకుని అసైన్డ్ భూములు, 22ఏకు సంబంధించిన భూములు, నిషేధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విధంగా రెవెన్యూ అధికారులు లాలూచీ పడినట్లు విచారణలో తేలింది. ఉమ్మడి చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో 2 లక్షల 44 వేల ఎకరాల భూములు ఫ్రీహోల్డ్ చేశారని సిసోదియా గతంలో వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈకేసులో ఇప్పటివరకు పోలీసులు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదు. 9 కేసులు నమోదు చేసినా చర్యలు తీసుకోలేదు. సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో రెండు రోజుల్లో తిరుపతి సీఐడీ అధికారులు అన్నమయ్యజిల్లా ఎస్పీని కలిసి కేసు ఫైలును తీసుకునే వీలుందని సమాచారం. కేసు సీఐడీకి బదిలీ కాగానే నిందితులుగా భావిస్తున్న వారిని మరోసారి సీఐడీ అధికారులు విచారణకు పిలిచి, అవసరమైతే అరెస్టులు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
మదనపల్లె దస్త్రాల దహనం కేసు - ఇద్దరు ఆర్డీఓలపై సస్పెన్షన్ వేటు - Madanapalle Fire Accident Case