Pinnelli Ramakrishna Reddy Arrest !: ఈవీఎం విధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో అరెస్టు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఏపీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇస్నాపూర్ లొకేషన్ గురించి పటాన్‌చెరు పోలీసులను అడిగిన ఏపీ పోలీసులు ఇస్నాపూర్ వరకు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకొని పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం ఉదయం నుంచి గాలించిన పోలీసులు ఆయనను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పోలీసుల గాలింపు విషయం తెలుసుకున్న పిన్నెల్లి వారి కళ్లుగప్పి పరారయ్యేందుకు విఫల యత్నం చేశారు. మా చర్ల ఘటనపై ఆగ్రహంగా ఉన్న ఈసీ, పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని ఇప్పటికే ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హెదరబాద్ లో పిన్నెల్లి సోదరులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిపై పది సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు, ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు చేమన్నారు. ఇక పిన్నెల్లిపై పీడీ పీపీ చట్టం కింద మరో కేసు నమోదు నమోదు చేశారు. ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం ఘటన వెలుగులోకి రావడంతో ఈనెల 20న పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆయనను అరెస్ట్ చేశారు.
తెలంగాణ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు: ఈవీఏం ధ్వంసం కేసు వెలుగులోకి రాగానే పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈమేరకు వారిని అరెస్ట్ చేయడనికి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకున్నారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. పిన్నెల్లి తెలంగాణలోని సంగారెడ్డి వైపు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది వద్ద పిన్నెల్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పిన్నెల్లి కాన్వాయ్‌ను పల్నాడు పోలీసులు వెంబడించారు. పోలీసుల కళ్లుగప్పి పిన్నెల్లి మరో కారులో పరారయ్యారు. ఎట్టకేలకు ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో పిన్నెల్లి రామకృష్ణ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
అరెస్ట్ విషయం మాకు తెలియదు: పిన్నెల్లి అరెస్టుపై సంగారెడ్డి ఎస్పీ రూపేష్ స్పందించారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని మాకు ఏపీ పోలీసులు చెప్పారని పేర్కొన్నారు. పిన్నెల్లి కోసం పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు పెట్టామన్నారు. వాహనాలు అదుపులోకి తీసుకునేంత వరకే మాకు తెలుసని, పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్న విషయం తమకు తెలియదని సంగారెడ్డి ఎస్పీ వెల్లడించారు.