Lulu Group Came Again to AP : అంతర్జాతీయ వాణిజ్య సంస్థ లులు గ్రూప్ మళ్లీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందం మేరకు పెట్టుబడులు కార్యరూపం దాల్చే సమయంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ఆ సంస్థను రాష్ట్రం నుంచి తరిమేసింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు సీఎం కావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విశాఖతో పాటు విజయవాడ, తిరుపతిలో మాల్స్, మల్టిఫ్లెక్స్‌ల నిర్మాణం, ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రితో చర్చించింది.
అయిదేళ్ల క్రితం జగన్ ప్రభుత్వ విధానాలతో విసిగివేసారి ఏపీలో ఇక ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోమంటూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన అంతర్జాతీయ సంస్థ లులు గ్రూప్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ ఏపీలో అడుగు పెట్టింది. సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ తన బృందంతో కలిసి అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. సీఎం వారికి సాదర స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీఫ్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణంతోపాటు ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి కనబరిచారు.
ఏపీకి లులు గ్రూప్ - సీఎం చంద్రబాబుతో ఛైర్మన్ యూసఫ్ అలీ భేటీ - Lulu Chairman Meets Chandrababu
మూడు ప్రాంతాల్లో పెట్టుబడులు : సులభతర వాణిజ్యం, వేగవంత వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల్ని ప్రోత్సహించేందుకు తాము తీసుకొస్తున్న నూతన పాలసీలను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపడం, మూడు ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఛైర్మన్ అలీతోపాటు సంస్థ ప్రతినిధుల్ని సత్కరించారు. తిరిగి వెళ్లే సమయంలో యూసఫ్ అలీని ఆలింగనం చేసుకుని, కారు వరకు వచ్చి చంద్రబాబు వారికి వీడ్కోలు పలికారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందం రద్దు : విశాఖలో రూ.2200 కోట్ల పెట్టుబడితో షాపింగ్ మాల్, 5 వేల సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, అయిదు నక్షత్రాల హోటల్ నిర్మాణం ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018 సంవత్సరంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో లులు గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందుకు 13.83 ఎకరాల భూమిని ఆనాటి టీడీపీ ప్రభుత్వం కేటాయించింది. ఈ నేపథ్యంలో లులు గ్రూప్ అంతర్జాతీయ కన్సల్టెంట్లతో డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. 2019లో ఎన్నికలు రావడం, జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతోనే భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని బురదజల్లే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది.
జగన్ తీరు నచ్చక వెళ్లిపోయిన సంస్థ : జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లులు గ్రూప్ ఇక ఏపీలో పెట్టుబడులు పెట్టబోమని పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఆ వెంటనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడుల్లో రూ. 3,500 వేల కోట్ల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. గత ప్రభుత్వం తరిమేయకపోతే విశాఖలో లులు గ్రూప్ చేపట్టిన ప్రాజెక్టులు పూర్తయ్యేవి. వేలాది మందికి ఉపాధి దొరకడంతోపాటు ఆ సంస్థ నుంచి వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేవి.
నాటి ముఖ్యమంత్రి జగన్ వ్యవహారశైలితో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అప్పుడు పారిపోయిన పెట్టుబడిదారులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఏపీ వైపు మొగ్గుచూపుతున్నారు. లులు సంస్థతో భేటీపై సామాజిక మాధ్యమం ఎక్స్‌లో సీఎం చంద్రబాబు స్పందించారు. తన పాత మిత్రులు మళ్లీ తిరిగి వచ్చారని హర్షం వ్యక్తం చేశారు. సంస్థకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం వారికి హామీ ఇచ్చారు.
LULU Lands in AP: ‘లులు’ను తరిమేశారు.. వీళ్లు మేసేశారు!.. ఆ స్థలాల్లో ఎల్‌ఎల్‌పీ సంస్థల నిర్మాణాలు