Konaseema Famous Sweet Pichuka Gullu Special Story : కోనసీమ అంటే ఆహ్లాదకరమైన పచ్చదనానికే కాదు, అదరగొట్టే రుచులకూ చిరునామా. ఇక్కడ పసందైన పిచ్చుక గూళ్లను కరకరలాడిస్తూ ఆరగించేస్తారు. ఇదేంటీ చిత్రంగా పిచ్చుక గూళ్లను తినడమేమిటని అనుకోకండి! తీయగా ఉండే గర్రాజులనే వంటకాన్ని ఇక్కడి వాళ్లంతా దాని ఆకారాన్ని బట్టి పిచ్చుకగూళ్లు అని పిలుస్తుంటారు.
216 జాతీయ రహదారి చెంత : నగరం నుంచి మామిడికుదురు వరకు 216 జాతీయ రహదారికి ఇరువైపులా దాదాపు 70 వరకు గర్రాజులు తయారు చేసే దుకాణాలు కనువిందు చేస్తాయి. రోడ్డుకు ఇరువైపుల వీటిని వండుతూ విక్రయాలు చేస్తున్నారు. ప్రయాణికులు, వాహన చోదకులు వీటిని ఆసక్తిగా తిలకించడంతో పాటు ఆగి రుచి చూసి తమ వెంట తీసుకువెళ్తారు. పండగలు, శుభకార్యాలకు వీటిని ఆర్డర్లిచ్చి మరీ వీటిని చక్కగా కొనుగోళ్లు చేస్తున్నారు.
నోట్లో వేస్తే కరిగిపోయే "కమ్మని కలాకండ్" - ఇలా చేస్తే అచ్చం స్వీట్ షాప్ టేస్ట్!
తయారు చేసే విధానం : నానబెట్టిన బియ్యాన్ని పిండిగా చేసి పాకం పట్టిన బెల్లం లేదా పంచదారను అందులో కలిపి ధారగా పడేలా పలచగా చేస్తారు. బాగా కాగిన నూనెలో (Oil) రంధ్రాలున్న నిలువు చట్రం ద్వారా పిండిని తిప్పుతూ అందులో గుండ్రంగా పోస్తారు. కాసింత వేగిన తరవాత దానిని అర్ధచంద్ర ఆకారంలో మడిచి దోరగా వేగే వరకు ఉంచుతారు. కొంత మంది నూనెకు బదులుగా నెయ్యి ఉపయోగిస్తారు. మరి కొందరు బెల్లం, పంచదారతో కాకుండా తేనెతో తయారు చేయించుకుంటారు. 30 నుంచి 40 గ్రాముల వరకు బరువుండే పిచ్చుకగూళ్లను ఒక్కో గర్రాజీ రూ.10- రూ.12కి విక్రయిస్తున్నారు. గాలి తగలని డబ్బాల్లో వీటిని జాగ్రత్త చేసుకుంటే దాదాపు 3 వారాల వరకు నిల్వ ఉంటాయి.
ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!
ఇక్కడికిలా వచ్చి చేరింది : దాదాపు 35 సంవత్సరాల క్రితం ఉపాధి రీత్యా బర్మా వెళ్లిన మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని కొందరు ముస్లింలు అక్కడి వంటకాన్ని ఇక్కడికి తీసుకువచ్చారు. అది కాలక్రమేణా వారి పండగలు, శుభకార్యాల్లో ఓ సంప్రదాయ మిఠాయిగా నిలిచింది. అలా స్థానికంగా నగరం, మామిడికుదురు పరిధిలో దాదాపు 200 కుటుంబాల వారికి పిచ్చుకగూళ్ల తయారీ ఉపాధిగా మారింది. కోనసీమ మీదుగా ఉన్న 216 జాతీయ రహదారి వల్ల బాహ్య ప్రపంచంతో వీటికి బంధం మరింత బలంగా ఏర్పడింది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో (Godavari Dist) పలు చోట్ల వీటి విక్రయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు యూఎస్‌ఏ (USA), గల్ఫ్ దేశాలకు (Gulf Countries) వెళ్లే వారు వీటిని ప్రత్యేకంగా అట్టపెట్టెల్లో భద్రపరచి తీసుకువెళ్తున్నారు.
మధురమైన "స్వీట్ పూరీలు" - ఇలా చేస్తే అద్భుతాన్ని ఆస్వాదిస్తారు! - Pakam Purilu Recipe