Kodi Katti Srinu Mother and brother gave up initiation: కోడి కత్తి కేసులో సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ, గత నాలుగు రోజులుగా శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరాహార దీక్ష చేస్తున్నారు. నేడు శీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం విషమించడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అనంతరం శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజును విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని టీడీపీ నేత బొండా ఉమ, నక్కా ఆనంద్‌బాబు, సీపీఐ నేత రామకృష్ణ తదితరులు పరామర్శించారు. శ్రీను తరఫున న్యాయపోరాటం చేస్తామని, దీక్ష విరమించాలని విపక్షాలు విజ్ఞప్తి చేశాయి. విపక్షాల విజ్ఞప్తితో సావిత్రమ్మ, సుబ్బరాజులు దీక్ష విరమించారు. టీడీపీ నేత బొండా ఉమ, సీపీఐ నేత రామకృష్ణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
న్యాయం చేయాలంటూ నాలుగు రోజులుగా దీక్ష: తన కుమారుడు, సోదరుడికి బెయిల్ మంజూరు చెయ్యాలని కొడికత్తి శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. కోడి కత్తి శ్రీనివాస్‌ను వెంటనే విడుదల చేయాలంటూ గత మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. శ్రీను తల్లి సావిత్రమ్మ ఆరోగ్యం విషమించడంతో, వారిని పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు నిరాహార దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో పోలీస్ జీపు ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకోవడానికి నిరసనకారులు ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులను చెదరగొట్టి కోడి కత్తి శీను కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు.
జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడి కత్తి శ్రీను తల్లిని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో హత్యలు చేసిన వారు 3 నెలల్లో బయటకు వస్తున్నారని నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. కోడి కత్తి శ్రీనులా దేశంలో మరెవరికీ శిక్ష పడినట్లు లేదని వాపోయారు. జగన్ ఎందుకు అడ్డుకుంటున్నారో అర్ధం కావటం లేదని దుయ్యబట్టారు. జగన్ బాబాయ్ హత్య కేసులో ప్రధాన నిందితులు బయట తిరుగుతున్నారని ఆక్షేపించారు. కోర్టుకి వెళ్లి జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదని నిలదీశారు. వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పి కోడి కతి శ్రీనుని బయటకు తీసుకురావాలని ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
దళిత సంఘాల ఆందోళనలు: కోడి కతి శ్రీను దీక్షకు మద్దతుగా అనకాపల్లి జిల్లా, నర్సీపట్నంలో ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. దళితుడైన శ్రీను నిందితుడిగా అయిదేళ్ల పాటు జైల్లో మగ్గుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు రావడానికి ఎందుకు నిరాకరిస్తున్నారో చెప్పాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు.