Key Files Missing in Ponnuru MRO Office : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వివిధ శాఖలు సంబంధించిన కీలక దస్త్రాలు మంటల్లో కాలిపోవడం, చెత్తకుప్పలో కనిపించడం ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న స్థానిక కార్యాలయాల్లో పని చేస్తున్న అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి.
Documents Missing in Ponnuru : గుంటూరు జిల్లా పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయమయ్యాయి. స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉంది. 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖామంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి (డీవీసీ) పేరుతో నామకరణం చేశారు.
గుంటూరులో చెత్తలో ఫైళ్లు - అధికారులు వచ్చే సరికి మాయం - File In Garbage Tahsildar Office
సీఐడీ అధికారులు విచారణ : కొంతమంది ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని కాలనీకి చెందిన ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల సందర్భంగా ఆర్‌ఓ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు.
సీనియర్ అసిస్టెంట్ అనందరావుకు నోటీసు : ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. ఆ సమయంలో డీవీసీ కాలనీ, సీఐడీ విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరారు.
దీంతో దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతకడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తున్నా వాటి ఆచూకీ లభ్యం కాలేదు. దీనిపై పొన్నూరు ఇన్‌ఛార్జి తహసీల్దారు ఐ. ప్రశాంతిని వివరణ కోరగా డీవీసీ కాలనీ చెందిన కీలక దస్త్రాలు కనిపించని మాట వాస్తవమేనని, ఇందుకు బాధ్యులైన సీనియర్ అసిస్టెంట్ అనందరావుకు నోటీసు ఇచ్చామని చెప్పారు.