VR Siddhartha College Flyover Bridge: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాలలో అసంపూర్తిపై వంతెనకు మంచి రోజులు వచ్చాయి. ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ విజయం సాధించడంతో దీనిపై కొత్త ఆశలు చిగురించాయి. విజయవాడ నగరంపై ట్రాఫిక్ రద్దీ భారం పడకుండా ఉండేందుకు బందరు రోడ్డుకు సమాంతరంగా పంట కాలువ రోడ్డును అభివృద్ది చేశారు. సనత్ నగర్ నుంచి తాడిగడప 100 అడుగుల రోడ్డును కలిపేలా, రహదారి రోడ్డు నిర్మాణం చేపట్టారు.
మధ్యలో కానూరు వీఆర్ సిద్దార్థ కళాశాల వద్ద పైవంతెన నిర్మించాల్సి వచ్చింది. 2017లో పెనమలూరు MLA బోడె ప్రసాద్ నాటి సీఎం చంద్రబాబు నుంచి ప్రత్యేకంగా అనుమతి తెచ్చి మరీ పనులు చేపట్టేలా కృషి చేశారు. 2019 వరకూ నిర్మాణ పనులు శరవేగంగా జరిగాయి! దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ సర్కార్ ఆ పెండింగ్ పనులు పూర్తిచేయకుండా గాలికొదిలేసింది. అసంపూర్తిగా ఉన్న వంతెనపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు నరకం చూస్తున్నారు.
వైఎస్సార్సీపీ విధ్వంస క్రీడ- ఆనవాళ్లు కోల్పోయిన గుంటూరు స్టేడియం - guntur cricket stadium
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో: వంతెనను పట్టించుకోకుండా వదిలేయడం వల్ల స్పీడ్ బ్రేకర్లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోలేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం, పైవంతెన మంజూరు చేయించిన బోడె ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలవడంతో పెండింగ్ పనులపై ఆశలు చిగురించాయి.
నిరంతరం వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉండటంతో కళాశాలలోని విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వంతెన సగం వరకు సౌండ్ బ్యారియర్లు ఏర్పాటు చేశారు. వంతెనపైన రోడ్డు వేసేందుకు అవసరమైన 10 లక్షలు వీఆర్ సిద్దార్థ కళాశాల యాజమాన్యం భరించనుండగా, ఫ్లైఓవర్‌కు ఇరువైపులా అప్రోచ్ రోడ్లు, డ్రెయిన్లకు అవసరమైన రెండున్నర కోట్ల రూపాయల నిధుల్ని తాడిగడప పురపాలక సంఘం, సీఆర్డీఏ ఇవ్వాల్సి ఉంది.
ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రయాణించవచ్చు: ఇక వంతెనపై నుంచి వందడుగుల రోడ్డు వరకూ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రస్తుతం 40 లక్షలు నిధులున్నాయని చెబుతున్నారు. పనులు ప్రారంభించి త్వరితగతిన అందుబాటులోకి తెస్తే, 50 వేల మంది జనాభాకు ప్రయోజనం కలగనుంది. బందరు రోడ్డుపై ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ రోడ్డు బందరు రోడ్డుకు సమాంతరంగా ఉన్న పంటకాలువ రోడ్డుకు అనుసంధానమై ఉంది. దీంతో వంతెన పూర్తయితే విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి తాడిగడప వంద అడుగుల రోడ్డు వరకూ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ప్రయాణించవచ్చు.