Kakinada Stella L Panama ship Issue: కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌకలో తమకు చెందిన పారాబాయిల్డ్ రైస్‌ను లోడ్ చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ శ్రీచిత్రా అగ్రి ఎక్స్‌పోర్ట్స్ మేనేజింగ్ పార్ట్నర్ కేవీ.భాస్కరరెడ్డి, పద్మశ్రీ రైల్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్యశ్రీ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ పోతంశెట్టి విశ్వనాథరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. బియ్యం రవాణా చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయా లేవా, నౌకలో బియ్యం లోడ్ చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారం ఏమిటీ తదితర వివరాలను తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అదనపు ఏజీ సాంబశివ ప్రతాప్ అభ్యర్థన మేరకు విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఉపముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలతో కాకినాడ పోర్టులో తమకు చెందిన పారా బాయిల్డ్ బియాన్ని బార్జ్‌ల నుంచి స్టెల్లా నౌకలోకి లోడ్ చేయకుండా కాకినాడ జిల్లా కలెక్టర్, కాకినాడ పోర్ట్ అధికారి అడ్డుకుంటున్నారని పేర్కొంటూ హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. విచారణలో ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ సాంబశివప్రతాప్ స్పందిస్తూ పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలన్నారు.
ఈ వ్యాజ్యాలపై విచారణను గురువారం విచారణ జరపాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ బియ్యాన్ని లోడ్ చేయకుండా నౌకను నిలిపివేయడంతో ఒక్కో పిటిషనర్‌కు రోజుకు 4.20 లక్షల చొప్పున డెమరేజ్ ఛార్జి పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర విచారణ జరపాలని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.
భారీగా నష్టం: కాగా కాకినాడ తీరంలో లంగరు వేసిన 'స్టెల్లా ఎల్ పనామా నౌక కదలికపై గత కొద్ది రోజులుగా తర్జన భర్జన కొనసాగుతోంది. దీని కారణంగా భారీగా నష్టం వాటిల్లుతోంది. నిరీక్షణ రుసుము, డెమరేజ్ ఛార్జ్ రోజుకి 20 లక్షల రూపాయల చొప్పున 4 కోట్లకు పైగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరింత ఆలస్యమైతే ఎక్కువ నష్టపోవాల్సి వస్తుంది.
'స్టెల్లా ఎల్' షిప్ హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11వ తేదీన వచ్చింది. కాకినాడ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్ దేశ ట్రేడ్ సెంటర్ కోటోనౌ పోర్టుకు బియ్యం చేరాల్సి ఉంది. ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52 వేల 200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. 32 వేల 415 టన్నుల బియ్యాన్ని షిప్‌లోకి నింపిన తర్వాత కలెక్టర్ తనిఖీ చేసి 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు ప్రకటించడంతో నౌక కదలికకు అడ్డంకులు ఎదురయ్యాయి.
కాకినాడ పోర్టులో 1,320 టన్నుల పీడీఎస్ రైస్ - వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు : కలెక్టర్ షాన్ మోహన్
అలలపై ఊగిసలాటలా స్టెల్లా నౌక భవితవ్యం - 'సీజ్ ద షిప్' సాధ్యమేనా!