Kadapa SP Transferred : కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ప్రభుత్వం బదిలీ చేసింది. వైఎస్సార్సీపీ నేత వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కడప ఎస్పీని బదిలీ చేసింది. అదే విధంగా కడప జిల్లాలో మరో సీఐను సైతం సస్పెండ్ చేసింది.
వైఎస్సార్సీపీ నేత వర్రా రవీంద్రరెడ్డిని అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదులు వచ్చాయి. చంద్రబాబు, పవన్, లోకేశ్, అనితపై వర్రా రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌కు కడప ఎస్పీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని హర్షవర్థన్‌రాజుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
వర్రా రవీంద్రరెడ్డి కేసులో మరో అధికారిపై వేటు: వర్రా రవీంద్రరెడ్డి కేసులో మరో అధికారిపై సైతం వేటు పడింది. కడప చిన్నచౌకు సీఐ తేజోమూర్తిని సస్పెండ్ చేసింది. ఎస్పీని తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో సీఐ తేజోమూర్తి సస్పెన్షన్ చేశారు. రవీంద్రరెడ్డిని వదిలిపెట్టడంలో సీఐ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
Varra Ravindra Reddy Issue: వైఎస్సార్ జిల్లా పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్ర రెడ్డి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, అనితకు వ్యతిరేకంగా అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతుండేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ప్రతిపక్షాలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వర్రా రవీంద్ర రెడ్డి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సైతం వాటిని కొనసాగిస్తూనే ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా రవీంద్ర రెడ్డి ఉన్నారు.
దీంతో అతనిపై పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. రవీంద్ర రెడ్డిని మంగళవారం సాయంత్రం అదుపులోకి తీసుకొని కడప తాలూకా పోలీస్ స్టేషన్‌కి తీసుకువచ్చారు. అయితే పులివెందులకు చెందిన ఓ వైఎస్సార్సీపీ నాయకుడి సూచనల మేరకు 41A నోటీసు ఇచ్చి రవీంద్రరెడ్డిని పోలీసులు వదిలేశారు.
Govt Angry Over Fake Posts: రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, అతనిపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం తీవ్రంగా స్పందించారు. ఫేక్ పోస్టులతో ఆడ బిడ్డలు బయట తిరగలేని పరిస్థితులు ఉంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని హెచ్చరించారు.
ఇంట్లో మహిళలపైనా, కుటుంబంపైనా, పిల్లలపైనా ఇష్టానుసారంగా పోస్టులు పెడితే సహించేదే లేదని తేల్చిచెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అసత్య పోస్టులపై ఇక ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు సైతం చెప్పారు. దీంతో అసత్య ప్రచారాలు, ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో వర్రా రవీంద్రరెడ్డి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహించిన అధికారులపై చర్యలు తీసుకుంది.
రవీందర్‌రెడ్డికి నోటీసులిచ్చి వదిలేసిన పోలీసులు - సీఎం చంద్రబాబు సీరియస్