Justice PC Ghosh Commission Inquiry And Engineers Attend To Hearing Before Kaleswaram Commission: సుందిళ్ల బ్యారేజీలోని 2 ఏ బ్లాకును డిజైన్ లేకుండానే నిర్మాణం ప్రారంభించినట్లు జస్టిస్ పీసీఘోష్ కమిషన్ ముందు ఇంజినీర్లు తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఇవాళ 16 మంది క్షేత్రస్థాయి ఇంజినీర్లు విచారణకు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ వారిని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన డీఈ, ఏఈఈలను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. పనులు, డిజైన్లు, నాణ్యతకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించారు.
రెండో బ్లాక్‌ను పరిగణలోకి తీసుకొని సుందిళ్ల బ్యారేజీని 2ఏ బ్లాకు నిర్మాణాన్ని డిజైన్ లేకుండానే ప్రారంభించినట్లు ఇంజినీర్లు తెలిపారు. అప్పటి చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. డిజైన్లు లేకుండా పనులు ఎలా చేపడతారని జస్టిస్ పీసీ ఘోష్ ఆక్షేపించారు.
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ - ప్రకాశం బ్యారేజి 40 గేట్లు ఎత్తి నీటి విడుదల
కొందరు ఇంజినీర్ల సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కమిషన్ తప్పుదోవ పట్టించవద్దని స్పష్టం చేసింది. అఫిడవిట్లో ఒక సమాచారం, విచారణలో మరొక సమాచారం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ విచారణలో ప్రమాణం చేసి అబద్ధం ఎలా చెబుతారని మండిపడ్డారు. అలా చేస్తే చర్యలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. పనులకు సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్లు, మెజర్మెంట్ బుక్స్‌పై ఇంజినీర్ల సంతకాలు తీసుకొన్న కమిషన్ వాటిని స్వాధీనం చేసుకొంది. రేపు మరో 18 మంది ఇంజినీర్లను కమిషన్ విచారణ చేయనుంది.