Journalists Homes Allotment Documents in Dust Bin : ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటించే పనిలో సీఎం జగన్, మంత్రుల బృందం ముందుంది. హామీలు ఇవ్వడంలో చూపిన ఉత్సాహం అమలులో మాత్రం కనిపించడం లేదు. వైస్సార్సీపీ మంత్రి రోజా స్వయంగా సంతకం చేసిన జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్ నాలుగు రోజుల అనంతరం చెత్తకుప్పలో దర్శనమివ్వడం విమర్శలకు దారి తీసింది. తమకు ఇళ్ల స్థలాలు వస్తాయని ఆశతో ఎదురు చూసిన జర్నలిస్టుల ఆశలు అడియాశలయ్యాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
40 మంది జర్నలిస్టులు నివాస స్థలాల కోసం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జర్నలిస్టులకు నివాస స్థలాలు మంజూరు చేస్తూ, మంత్రి రోజా సంతకం చేసిన తీర్మానం కాపీ చెత్త కుప్పలో దర్శనమిచ్చింది. ఈ ఘటనపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించే అంశంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మచిలీపట్నంలో 40 మంది జర్నలిస్టులు నివాస స్థలాలకు అర్హులని ఇటీవల జిల్లా కమిటీ తీర్మానం చేసింది. ఎంతో గోప్యంగా ఉండాల్సిన కమిటీ తీర్మాన ప్రతులు సోమవారం రాత్రి ఐ అండ్ పీఆర్ డీడీ కార్యాలయం పక్కన చెత్త కుప్పలో దర్శనమిచ్చాయి. ఈ ఘటపై జర్నలిస్టులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త కుప్పలో హౌస్ సైట్ ఫైల్స్ అంశంపై జిల్లా కలెక్టర్ పి. రాజబాబు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను విచారణ అధికారిగా నియమించారు.
ఇళ్ల పట్టాల పంపిణీపై హైకోర్టు విచారణ- వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు
స్పందించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర: జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్ని చెత్త కుప్పలో వేసిందెవ్వరని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మచిలీపట్నంలో ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడంపై కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ ఘటనపై కలెక్టరేట్లో సమాచార శాఖ డీడీని కలిసి వివరణ కోరారు. పది రోజుల క్రితం ఆఫీసులో ఫైల్ మిస్ అయిందని రవీంద్రకు డీడీ తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని డీడీ తెలిపారు. డీడీ పనితీరుపై కొల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని డీడీని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఇళ్లు ఇస్తామని పిలిచి ఉసూరుమనిపించిన వైసీపీ నేతలు - కన్నీరుపెడుతూ వెనుతిగిన పేదలు