Once Again Notices Issued to Perni Nani Wife : వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో బియ్యం మాయం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ఇటీవల ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ వచ్చినట్లు గుర్తించారు.
దానికి సంబంధించి ఇప్పటికే ఆమె రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించారు. అయితే తాజాగా ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తంగా 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చారు. దీంతో పెరిగిన షార్టేజీకి కూడా జరిమానా చెల్లించాలని తాజాగా మరోసారి పేర్ని నాని భార్య జయసుధకు నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని గీతాంజలి శర్మ నోటీసుల్లో పేర్కొన్నారు.
మొదటి నిందితురాలిగా పేర్ని నాని భార్య: రేషన్ బియ్యం మాయం కేసులో మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డినే పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాములో రేషన్ బియ్యం మాయంపై ఇటీవల కోటిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గుడ్న్యూస్ - ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం!
ఈ క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే గోదాము మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయనను పట్టుకున్నారు. ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా గోదాముల మేనేజర్ మానసతేజను రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న వీరిద్దర్నీ బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు.
ముందస్తు బెయిల్ మంజూరు: మరోవైపు ఇదే కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరైంది. ఈ కేసులో విచారణ జరిపిన 9వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణలో పోలీసులకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు - పోలీసుల అదుపులో కోటిరెడ్డి