Jai Bheem Chief Jada Sravan Kumar Fire on CM Jagan : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్లంలో బుధవారం రాత్రి సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు దళిత కాలనీలోని ఇళ్లకు నిప్పంటించారు. అడ్డుకున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ సంఘటనపై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అధికార పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నేతలు పది వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అక్రమంగా లాగేసుకున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికార పార్టీ నేతల అక్రమాల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన నిలదీశారు.
వైసీపీ నేతల విధ్వంసం - దళితులపై దాడి చేసి, గుడిసెలకు నిప్పుపెట్టిన ఎమ్మెల్యే అనుచరులు
చట్టపరమైన చర్యలు తీసుకోకుండా దాడి ఏంటి? : అనంతపురం జిల్లాలోని ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులు విధ్వంసం సృష్టించి, కాలనీలోని పూరి గుడిసెలను తగులబెట్టడాన్ని జడ శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. దళిత కాలనీపై దండెత్తడమేనా ప్రజాస్వామ్యమని వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ స్థలంలో దళితులు పూరి గుడిసెలు వేసుకున్నప్పుడు ఆ స్థలం నుంచి వారిని ఖాళీ చేయించాలని అనుకున్నప్పుడు కేసు పెట్టి చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని, అది కాకుండా దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు. ఇదీ దేనికి నిదర్శనమని ప్రశ్నించారు.
దళిత యువకుడు బొంతు మహేంద్రది ప్రభుత్వ హత్యే - న్యాయం జరిగే వరకూ పోరాటం తప్పదు : జడ శ్రావణ్ కుమార్
ఇదేనా అంబేడ్కరిజం అంటే : 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామంటూ గొప్పలు పలుకుతున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ వివరాలను బహిరంగ పరచగలదా? అని శ్రావణ్ కుమార్ సవాల్ విసిరారు. లక్షల ఇళ్లను కూడా నిర్మించలేని సీఎం దళితుల పూరి గుడిసెలను తన అనుచరులు తగలబెడితే ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఏ పరిపాలనకు సంకేతమని, ఇదేనా అంబేడ్కరిజం అని ప్రశ్నించారు.
బూటకపు సీఎంగా జగన్ గుర్తుంటారు : కళ్లార్పకుండా అబద్ధాలు ఆడే సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో వెలుగులు నింపలేదు సరి కదా, ఎన్నో బూటకపు మాటలతో నమ్మబలికి వంచించిన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. అధికారం కోసం ఎన్ని అబద్ధాలు అయినా చెప్పి, అవసరమైతే సొంత బాబాయిని కూడా చంపిన క్రిమినల్ సీఎం జగన్ అంటూ మండిపడ్డారు.