Jagan Government Conspiracy Against Amaravati: రాజధాని అమరావతిని విచ్ఛిన్నం చేసేందుకు ఐదేళ్లుగా ప్రణాళికాబద్ధంగా కృషి సాగిస్తున్న జగన్ సర్కారు మరో కుట్రకు తెరతీసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధానిలో ఇచ్చిన భూసేకరణ ప్రకటనను ఉపసంహరించింది. ప్రభుత్వ ఆదేశాలు, సీఆర్డీఏ కమిషనర్ ప్రతిపాదనల మేరకు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి గుట్టుగా గెజిట్ విడుదల చేశారు. 21 రెవెన్యూ గ్రామాల్లోని 625 ఎకరాలను భూసేకరణ పరిధి నుంచి తప్పించారు. రాజధాని బృహత్ ప్రణాళికను మరింత అస్థిర పరిచే కుట్రకు ప్రభుత్వం తెరలేపిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే తడవుగా ఈ మొత్తం ప్రక్రియలో సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి క్రియాశీల పాత్ర పోషించారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఈ విచ్ఛిన్నకర నిర్ణయం వల్ల భవిష్యత్తులో రాజధాని నిర్మాణం సంక్లిష్టం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిని విచ్ఛిన్నం చేసేలా వైసీపీ కుట్రలు- భూసేకరణ ప్రకటన ఉపసంహరణకు కసరత్తు
రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం 34,281 ఎకరాలను 25,398 మంది రైతుల నుంచి భూసమీకరణ విధానంలో తీసుకుంది. కొన్నిచోట్ల భూములు ఇవ్వడానికి ముందుకు రాని చోట్ల బృహత్ ప్రణాళిక దెబ్బతినకుండా భూసేకరణ ద్వారా తీసుకునేందుకు నిర్ణయించారు. ఇందుకు 1,317.90 ఎకరాలను 2013 భూసేకరణ చట్టం కింద తీసుకునేందుకు సంబంధిత రైతులకు నోటీసులిచ్చారు. భూసేకరణ వద్దని తాము పూలింగ్‌లో భూములిస్తామని కొందరు రైతులు సీఆర్డీఏను ఆశ్రయించారు. దీంతో సేకరణ నుంచి 274.86 ఎకరాలను అప్పట్లో మినహాయించారు. సేకరణకు అంగీకరించిన రైతులకు పరిహారాన్నీ అందించారు. బృహత్ ప్రణాళిక, రోడ్ల కోసం 217.76 ఎకరాలను కేటాయించారు. వివిధ సంస్థలకు 8.40 ఎకరాలను ఉద్దేశించారు. ఇవన్నీ పోగా ఇంకా 625.25 ఎకరాలు మిగిలింది. ఈ సమీకరణకి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను భూసేకరణ ప్రాంతాల్లోనూ కేటాయించారు.
బ్యాంకులకే మోసం - రాజధానిలో నివాస గృహాలు పూర్తైనట్లు జీవో విడుదల
గుట్టుగా గెజిట్ విడుదల: భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు అప్పట్లో కోర్టును ఆశ్రయించడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సేకరణను పక్కన పెట్టేసింది. బృహత్ ప్రణాళికను దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇందులో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాకలో భూసేకరణ ప్రకటనను ఉపసంహరించుకునే అంశంపై హైకోర్టు అదనపు అడ్వొకేట్ జనరల్‌ను ప్రభుత్వం న్యాయ సలహా కోరింది. ఆయన నుంచి సానుకూలంగా సమాధానం రావడంతో అథారిటీ సమావేశంలో భూసేకరణ నోటీసుల్ని ఉపసంహరించుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 21 రెవెన్యూ గ్రామాల్లో 625.25 ఎకరాలను భూసేకరణ నుంచి మినహాయించాలని సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి ప్రతిపాదనలు పంపించారు. దానికి గుంటూరు కలెక్టర్ ఆమోదించి గ్రామాల వారీగా గెజిట్‌లను గుట్టుగా విడుదల చేశారు.
సాధారణంగా భూసేకరణ ఉపసంహరణ గెజిట్‌లను విడుదల చేసే ముందు గతంలో సేకరణ ప్రాంతాల్లో కేటాయించిన రిటర్నబుల్ ప్లాట్లను చట్టప్రకారం రద్దు చేయాలి. అనంతరం సంబంధిత రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలి. ఈ రెండు అంశాల్లో ప్రభుత్వం చట్టవిరుద్ధంగా వ్యవహరించడం వల్ల ప్లాట్ల రద్దు ఉత్తర్వులను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఈ ప్రక్రియ వల్ల రైతుల హక్కులకు తీవ్ర భంగం కలుగుతున్నందున ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపును రైతులు సామూహికంగా బహిష్కరించారు. ఈ క్రమంలో గతంలో కేటాయించిన ఎల్‌పీఎస్ ప్లాట్ల విస్తీర్ణాన్ని మినహాయించకుండా గంపగుత్తగా జారీ చేసిన గెజిట్లపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చట్టాన్ని అతిక్రమించి ప్రభుత్వం వ్యవహరించిందని ఆవేదన చెందుతున్నారు.
బ్యాంకులను బురిడీ కొట్టించేందుకు సిద్ధమైన జగన్ సర్కార్ - కట్టుకథలు చెప్పాలంటూ అధికారులపై ఒత్తిడి
భవిష్యత్తులో తీవ్ర ప్రభావం: అమరావతిలో గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ పేరుతో నవ నగరాలను నిర్మించేందుకు వీలుగా అప్పట్లో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు. ఈ మేరకు బృహత్ ప్రణాళికకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు భూములు ఇవ్వని గ్రామాల్లో సేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం భూసేకరణను ఉపసంహరించడం ద్వారా రాజధాని బృహత్ ప్రణాళికకు భంగం కలుగుతుంది. దాని స్వరూపం దెబ్బతింటుంది. ప్రణాళికలో భాగంగా ఈ భూముల్లో పలు జోన్లను ఏర్పాటు చేశారు. భూసేకరణ నుంచి వెనక్కి వెళ్లడం ద్వారా అభివృద్ధి కుంటుపడుతుంది. భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వానికి రాజధాని నిర్మాణం ఇబ్బందిగా మారుతుంది. ఈ గెజిట్లను రద్దు చేసేందుకు ఉపక్రమిస్తే భూ యజమానులు కోర్టులను ఆశ్రయిస్తే ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుంది. భూసేకరణను మొదటి నుంచి ప్రారంభిస్తే ప్రక్రియలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. అంతిమంగా ఇది రాజధాని నిర్మాణంపై తీవ్ర ప్రభావం చూపనుంది.