Jagan and Sharmila Shares Disputes : 'సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్'కి చెందిన ఆస్తులన్నీ తనకే చెందుతాయంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కోర్టుకెళ్లడం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఎవరి సొమ్మని జగన్ వాటిని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది.
Property Dispute Between YS Jagan and Sharmila : ప్రకృతి వనరులు, ఖనిజాలు ప్రజల సంపద. ప్రభుత్వం వాటికి కాపలాదారు మాత్రమే. ప్రతిఫలం ప్రజలకే చెందాలి! కానీ తండ్రి రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, తర్వాత తాను ముఖ్యమంత్రయ్యాక తన అధికారాన్ని ఉపయోగించి జగన్ ప్రకృతి సంపదను చెరబట్టారు. ఆయన అడ్డగోలుగా సాగించిన దోపిడీల్లో సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రాజెక్టు ఒకటి.
ఆస్తుల పంపకంలో భాగంగా చెల్లెలు షర్మిలకు సరస్వతి పవర్ కంపెనీ షేర్లు ఇచ్చినట్టే ఇచ్చిన జగన్. అక్కడి భూములు, ఖనిజ సంపద విలువ భారీగా పెరగడంతో అడ్డం తిరిగి, అవన్నీ తనకే చెందాలంటూ కోర్టుకు ఎక్కారన్న అభిప్రాయంరాష్ట్ర ప్రజల్లో ఉంది. అప్పట్లో అధికారాన్ని అడ్డు పెట్టుకుని సరస్వతి పవర్ పేరుతో రైతుల నుంచి జగన్ ఎకరా రూ. 3 లక్షల చొప్పున కారుచౌకగా భూములు కొన్నారు. మొత్తం 1,515.93 ఎకరాల వరకు ఉన్న మొత్తం భూమిలో వాగులు, వంకలు, కొండ పోరంబోకు వంటి ప్రభుత్వ భూములు కూడా కొద్ది మొత్తంలో ఉన్నాయి. ఆ భూముల విలువ ఇప్పుడు సుమారు రూ. 220 కోట్లు పైమాటే. వాటిలో ఉన్న సున్నపు రాయి నిక్షేపాల్ని అప్పట్లో వైఎస్ ప్రభుత్వం సరస్వతి పవర్‌కి అడ్డగోలుగా కట్టబెట్టింది. దాని విలువే ఇప్పుడు సుమారు రూ. 10,308.80 కోట్లు ఉంటుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు 1.70 లక్షల టన్నుల సున్నపు రాయి లభిస్తుందని అంచనా. ప్రస్తుతం సిమెంట్ గ్రేడ్ సున్నపు రాయి విలువ మార్కెట్‌లో టన్ను రూ. 400 వరకు ఉంది.
MOUపై సంతకం ఎలా చేశారు? అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా? - జగన్‌కు ప్రశ్నలు సంధించిన షర్మిల
కారు చౌకగా వందల ఎకరాల భూములు కొనుగోలు : ఏపీలోని గనుల్ని, ఖనిజాల్ని తమ కుటుంబ ఆస్తులుగా, గనుల శాఖను తమ జేబు సంస్థగా భావించిన వైఎస్ కుటుంబం రాజశేఖర్‌రెడ్డి హయాంలో, ఆ తర్వాత జగన్ జమానాలో ఎడాపెడా దోపిడీకి పాల్పడింది. అత్యంత విలువైన సున్నపురాయి నిక్షేపాల్ని ఇష్టానుసారం కేటాయించుకోవడం ద్వారా వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించుకోవచ్చో భారతీ సిమెంట్స్ ద్వారా గ్రహించిన వైఎస్ కుటుంబం అదే తరహా దోపిడీకి తెరతీసేందుకు సరస్వతి పవర్‌ని తెరపైకి తెచ్చింది. ఆ కంపెనీ పేరుతో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2008లోనే రైతుల నుంచి జగన్ కారు చౌకగా వందల ఎకరాల భూములు కొనుగోలు చేయడం ప్రారంభించారు.
వైఎస్ రెండోసారి ఎన్నికల్లో గెలిచిన రెండోరోజే 2009 మే 18న సరస్వతి పవర్ సంస్థకు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలో 1,515.93 ఎకరాల్లో అత్యంత విలువైన సున్నపురాయి నిక్షేపాల్ని ప్రభుత్వం కట్టబెట్టేసింది. అంత విలువైన భూముల్ని, ఖనిజ సంపదను గుప్పిట్లో పెట్టుకున్న జగన్.. ఇప్పటివరకు అక్కడ పరిశ్రమ స్థాపనకు ఇటుకరాయి కూడా వెయ్యలేదు. గడువులోగా పరిశ్రమ స్థాపించనందున.. గతంలో టీడీపీ ప్రభుత్వం సున్నపురాయి లీజులు రద్దు చేస్తే, 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ వాటిని పునరుద్ధరించుకున్నారు. కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీల జలాల్నీ అడ్డగోలుగా కేటాయించుకున్నారు!
పెద్ద ప్లానే : 'సరస్వతి పవర్' వాస్తవానికి విద్యుదుత్పత్తి కోసం ఏర్పాటు చేసిన కంపెనీ. కానీ భారతీ సిమెంట్‌లో అడ్డగోలుగా లబ్ధి పొందిన జగన్, అదే తరహాలో సరస్వతి పవర్‌ను కూడా సిమెంట్ కంపెనీగా మార్చేయాలనుకున్నారు. 2008 ఆగస్టు 18న జగన్ అధ్యక్షతన కంపెనీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కంపెనీ లక్ష్యాల్ని సవరిస్తూ ఆయన భార్య భారతీరెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక మీదట కంపెనీ సిమెంట్, క్లింకర్ ఉత్పత్తి, అమ్మకాల్లోకి అడుగుపెడుతుందని, సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన గనుల నిర్వహణ చేపడుతుందని తీర్మానం చేశారు. జగన్ తల్లి విజయలక్ష్మి దాన్ని బలపరిచారు. అయితే, సరస్వతి పవర్ సంస్థ సిమెంట్ రంగంలోకి ప్రవేశిస్తూ తీర్మానం చేయడానికి కొన్ని నెలల ముందు నుంచే గనుల లీజు కట్టబెట్టేందుకు సన్నాహాలు జరిగాయి.
2008 ఏప్రిల్ 30నే అప్పటి గనులశాఖ డైరెక్టర్ రాజగోపాల్ ప్రభుత్వానికి దస్త్రం పంపారు. సున్నపురాయి గనుల లీజు దక్కింది 2009 మేలో అయితే.. సరస్వతి పవర్ యాజమాన్యం 2008-09 ఆర్థిక సంవత్సరంలోనే భూసేకరణ కింద రూ. 16.36 కోట్లు ఖర్చు చేసింది. వాస్తవానికి అంతకు రెండు సంవత్సరాల ముందు నుంచే రైతులతో సంప్రదింపులు జరిపింది. 2008 సెప్టెంబరు 26 నుంచి 2011 మే 3 మధ్య ఆ భూములు కొనుగోలు చేసింది. ప్రభుత్వం తమ చేతుల్లోనే ఉంది కాబట్టి సున్నపురాయి నిక్షేపాలు ఎలాగైనా దక్కించుకుంటామన్న ధీమాతోనే ముందుగానే వందల ఎకరాల భూములు గుప్పిట్లో పెట్టుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ద్వారా ఏర్పాటు చేయాలనుకుంటున్న సిమెంట్ కర్మాగారంలో రూ. 3,257 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు 2010లో ప్రభుత్వానికి సమర్పించిన పర్యావరణ ప్రభావ నివేదికలో జగన్ పేర్కొన్నారు.
ఓ చెల్లి కన్నీటి గాథ - అన్నపై ఎక్కుపెట్టిన బాణం
జగన్ అధికారంలోకి రాగానే లీజుల పునరుద్ధరణ : సరస్వతి పవర్‌లో తనకు రూ. 26.4 కోట్ల విలువైన వాటాలు, తన భార్య భారతికి రూ. 13.8 కోట్ల విలువైన వాటాలు ఉన్నట్టు జగన్ 2019 ఎన్నికల్లో నామినేషన్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే 2019 డిసెంబరులో సరస్వతి పవర్‌కు గనుల లీజు పునరుద్ధరించడంతో పాటు, లీజు కాలపరిమితిని 50 ఏళ్లకు పెంచేసుకున్నారు. సరస్వతి పవర్‌కు కృష్ణా నది నుంచి 0.0689 టీఎంసీల జలాల్ని కేటాయించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చేశారు.
చిట్టడవిలా పంట పొలాలు : సరస్వతి పవర్ సంస్థ రైతుల నుంచి భూములు కొని, సున్నపురాయి లీజులు తీసుకుని 15 ఏళ్లయినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పంట పొలాలన్నీ బీడువారి చిట్టడవిలా మారాయి. కంపెనీ 24వ వార్షిక ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ ప్రకారం 2022-23లో సంస్థ టర్నోవర్ సున్నగా పేర్కొంది. ఇప్పటి వరకు కంపెనీ కార్యక్రమాలు ప్రారంభించలేదని తెలిపింది.
లీజులు రద్దు చేయాలి : సరస్వతి పవర్‌కి సున్నపురాయి గనుల కేటాయింపుపై ప్రస్తుత ప్రభుత్వం సమీక్షించి, వాటిని రద్దు చేయాలి. అత్యంత విలువైన ప్రకృతి సంపదను కొందరు వ్యక్తులు వారి గుప్పిట్లో పెట్టుకుని, అడ్డగోలుగా లబ్ధి పొందాలని చూడటం సరికాదు. అవసరమైతే ప్రభుత్వం కోర్టుకి వెళ్లి పోరాడైనా సరస్వతి పవర్‌కి గనుల లీజు రద్దయ్యేలా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
రైతులపై దాడులు : మూడేళ్లలో సిమెంట్ పరిశ్రమ సిద్ధమవుతుందని, స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తామని, సీసీ రోడ్లు వేస్తామని, మంచినీటి వసతి కల్పిస్తామని, ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పి రైతుల నుంచి సరస్వతీ పవర్ సంస్థ భూములు సేకరించింది. తమ భూమలు తీసుకుని ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు చేపట్టకపోవడంతో కొందరు రైతులు ఆ భూముల్లో పంటలు వేశారు.
2014లో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అనుచరుల్ని వెంటేసుకుని వెళ్లి ఆ పొలాల్ని ట్రాక్టర్లతో దున్నేశారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గనులు లీజుకు తీసుకుని రెండేళ్లయినా ప్లాంట్ పెట్టకపోవడంతో లీజు గడువు ముగిసినట్టుగా ప్రకటించాలని 2011 ఆగస్టు 10న అప్పటి గనులశాఖ ఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. చివరకు గనుల లీజుని రద్దు చేస్తూ ప్రభుత్వం 2014 అక్టోబరు 9న ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు డైరెక్టర్లను వెళ్లగొట్టి : మొదట్లో సరస్వతి పవర్ చాలా చిన్న కంపెనీ. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో కాకతీయ కాలువపై 3 మెగావాట్‌ల సామర్థ్యం గల పవర్‌ప్లాంట్ మాత్రమే ఉండేది. 2009 వరకు దీని వార్షిక వ్యాపార పరిమాణం గరిష్ఠంగా రూ.కోటి దాటలేదు. 2008-09 నాటికి దీని నికర నష్టాలు రూ. 13.57 లక్షలు. అలాంటి చిన్న కంపెనీ వైఎస్ సర్కారు నుంచి కొన్ని లక్షల టన్నుల సున్నపురాయి నిక్షేపాలు దక్కించుకుని, రూ. 3,257 కోట్ల పెట్టుబడికి సిద్ధమైందంటే అంతా జగన్మాయ..!
వాస్తవానికి సరస్వతి పవర్‌ను గ్రంధి ఈశ్వరరావు, గ్రంధి సతీష్, గ్రంధి శశికళ 1999 మార్చి 31న స్థాపించారు. ఆ తర్వాత అది వైఎస్ కుటుంబం పరమైంది. జగన్ తన సన్నిహితుడు డి.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు 1999 అక్టోబరు 31న కంపెనీలో డైరెక్టర్లుగా చేరారు. వారు చేరిన రోజే సతీష్, శశికళ రాజీనామా చేశారు. ఆ తర్వాత 2000 జులై 1న గ్రంధి ఈశ్వరరావు కూడా బోర్డుకు రాజీనామా చేశారు. అదే రోజు ప్రస్తుత ఎంపీ విజయసాయిరెడ్డి బోర్డు డైరెక్టర్‌గా చేరి 2002 ఆగస్టు 12 వరకు కొనసాగారు. అంటే వైఎస్ ముఖ్యమంత్రి కాకముందే ఆ కంపెనీని ఆయన కటుంబం హస్తగతం చేసుకుంది.