J Brand Liquor End in AP : ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని మంగళవారం నుంచి అమలు చేయనుంది. సర్కారీ వారి మందు దుకాణాల్లో అమ్మకాలకు సోమవారంతో తెరపడింది. వైఎస్సార్సీపీ పాలనలో నూతన విధానం తీసుకొచ్చి ప్రభుత్వ దుకాణాలు తెరిచింది. జె-బ్రాండ్ల పేరుతో నాసిరకం అమ్మకాలు చేపట్టింది. ప్రతిపక్షాలు, మందుబాబులు గగ్గోలు పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు, మద్యం ధరలు, నాణ్యతపై అధ్యయనం చేసి నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.
New Liquor Policy in AP : అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు అమలు చేయనున్నారు. ఇకపై మందుబాబులు కోరుకునే అన్ని బ్రాండ్లకు అనుమతివ్వనుంది. తక్కువ ధర విభాగంలో క్వార్టర్ బాటిల్ మద్యాన్ని రూ.100 లోపే అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది ప్రభుత్వం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్వార్టర్ బాటిల్ మద్యం సుమారు రూ.200 వరకు ఉండేది. దీంతో యువత గంజాయి, మత్తు పదార్థాల వైపు మొగ్గుచూపారనే ఆరోపణలు వినిపించాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని రూ.99 లోపే ధర ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేటు వ్యాపారుల ఆరాటం : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మద్యం పేరుతో తెరతీసిన దోపిడీకి అక్టోబరు ఒకటితో తెరపడనుంది. నాసిరకం మద్యంతో మందుబాబుల జేబులు, ఆరోగ్యం గుల్లచేసింది. ఐదు ఏళ్లలో రూ.6,876 కోట్ల విలువైన నాసిరకం మద్యం తాగించింది. ప్రస్తుతం 2 జిల్లాల్లో 202 దుకాణాల్లో రోజుకు సగటున రూ.4 కోట్లకుపైగా విక్రయిస్తున్నారు. నూతవ దుకాణాల లైసెన్సులు దక్కించుకునేందుకు ప్రైవేటు వ్యాపారులు ఆరాటపడుతున్నారు. కూడికలు, తీసివేతల్లో తలమునకలై ఉన్నారు.
గతంలో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వారు తమ అనుచరులతో దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. తక్కువ జనాభా, ఎక్కువ వ్యాపారం జరిగే గ్రామీణ ప్రాంత దుకాణాలపై ఎక్కువ మంది కన్నేశారు. కొత్త విధానం అమలు విషయమై విజయనగరం ఎక్సైజ్ శాఖ ఉప కమిషనర్ బాబ్జీరావు వద్ద 'ఈనాడు' ప్రస్తావించగా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. నోటిఫికేషన్‌కు అనుగుణంగా చర్యలు చేపడతామని ఆయన అన్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 223 దుకాణాలు? : నూతన మద్యం విధానంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ దుకాణాల కన్నా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. గీత కార్మికులకు (ఈడిగ, గౌడ) రిజర్వ్ చేసిన దుకాణాలకు 2 రోజుల్లో పాలసీ రానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 202 దుకాణాలు ఉండగా ప్రస్తుతం 223 మద్యం దుకాణాలకు అనుమతివ్వనున్నట్లు తెలుస్తోంది.
తక్కువ ధరకు అన్ని బ్రాండ్లు అందుబాటులోకి - త్వరలో నూతన మద్యం పాలసీ! - ap liquor policy 2024
గెజిట్ నోటిఫికేషన్ జారీ : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 223 ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవనున్నట్లు సమాచారం. అక్టోబరు 1 నుంచి 9 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. అందిన దరఖాస్తుల్లో ఒక్కో దుకాణాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు.
ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు : నూతన మద్యం విధానం ద్వారా అమ్మకాలకు ఎక్సైజ్ అధికార యంత్రాంగం కసరత్తు పూర్తి చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. జనాభా ప్రాతిపదికన 4 స్లాబుల్లో లైసెన్స్‌దారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయనుంది. పది వేల జనాభాలోపు రూ.5 లక్షలు, 50 వేల లోపు రూ.50 లక్షలు, 50 వేలు దాటి లక్ష జనాభా లోపు రూ.65 లక్షలు, లక్ష జనాభా దాటిన తర్వాత రూ.85 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఏ ప్రాంత, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా మద్యం దుకాణానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
'రాష్ట్రంలో బీర్లు పుష్కలం - కొరతేమీ లేదు!' - No Shortage Of Liquor Stocks