Irrigation Water Problems for Guntur Farmers : అదృష్టాన్ని కాకుండా కష్టాన్నే నమ్ముకున్న అన్నదాతను ఖరీఫ్ సీజన్ కాటేసింది. నష్టం వచ్చిందని భూమిని ఖాళీగా వదిలేసేందుకు ప్రాణం ఒప్పక రబీలో (Rabi Season) పంట వేసిన రైతులకు మరోసారి నిరాశే ఎదురైంది. అక్టోబర్, నవంబర్‌లో తీవ్ర వర్షాభావం, డిసెంబరులో తుపాను దెబ్బకు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. తుపాను దెబ్బకు పంట అంతా నీటిపాలైంది.
పంటలు ఆశాజనకంగా లేవని రైతుల ఆవేదన : గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కలిపి రబీలో వరి సాగు విస్తీర్ణం దాదాపు లక్షా 48 వేల ఎకరాలు. తీవ్ర వర్షాభావం, సాగు నీటి ఎద్దడితో కేవలం 25 వేల 790 ఎకరాల్లోనే రైతులు వరిని సాగు చేస్తున్నారు. ఇది సాధారణ విస్తీర్ణంలో సుమారు 17 శాతం మాత్రమే. సాగు నీటి సరఫరా లేకపోవడంతో నీటి వనరులు ఉన్న అతి కొద్ది మంది రైతులు మాత్రమే వరి సాగు చేస్తున్నారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడం ఎప్పుడూ జరగలేదని రైతులు వాపోతున్నారు. మినుము, శనగ పంటలు ఆశాజనకంగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి ఎద్దడితో వరి రైతుల అవస్థలు - పట్టించుకోని అధికారులు
నీటి కష్టాల్లో అన్నదాతలు : ఉమ్మడి గుంటూరు జిల్లాలో రబీ సీజన్లో వరి తరువాత అధికంగా పండించే పంట మెుక్కజొన్న. సాగునీటి సమస్యతో ఈ మెుక్కజొన్న సాగు గణనీయంగా పడిపోయింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సుమారు లక్షా 47 వేల ఎకరాల విస్తీర్ణంలో మెుక్కజొన్న సాగు చేయాల్సి ఉంది. అయితే ఖరీఫ్ నీటి కష్టాలను చూసిన రైతులు కేవలం 70 వేల ఎకరాల్లోనే మెుక్కజొన్న పంటను వేశారు. వర్షాభావ పరిస్థితులు కారణంగా రబీలో మెుక్కజొన్నను వేసేందుకు ఆసక్తి చూపలేదు. వ్యవసాయాధికారులు సైతం మెుక్కజొన్న వేయవద్దని సూచించారు. దీంతో సగానికి సగం మెుక్కజొన్న పంట విస్తీర్ణం తగ్గింది.
'కేవలం ఒక్క తడికి నీళ్లడుగుతున్నా సర్కారుకు మనసు రావడం లేదు' - రైతులతో కలిసి పయ్యావుల ఆందోళన
ఇదే సమయంలో నీరు తక్కువగా అవసరమయ్యే శనగ, మినుము, తెల్లజొన్న లాంటి పంటల వైపు రైతులు మెుగ్గు చూపారు. అందుకే ఉమ్మడి గుంటూరు జిల్లాలో లక్షా 37 వేల ఎకరాల్లో శనగను రైతులు సాగు చేస్తున్నారు. అయితే ఈ రైతులను నీటి కష్టాలను వీడటం లేదు. తాగునీటి కోసం అధికారులు విడుదల చేసిన నీటినే రైతులు అరకొరగా పంటలకు పెడుతున్నారు. పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Guntur Farmers in Rabi Season : తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగర్ నుంచి సాగునీరు అందకపోవడంతో పంటను కాపాడుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సీజన్లోని నీటి ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రబీలో ఆ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీరు కోసం రైతుల ఆందోళన - పోలీసుల కాళ్లు పట్టుకుని వేడుకోలు