Irrigation Problems to Anantapur District Farmers : సాధారణంగా గోదావరి జిల్లా ప్రాంతాలు అంటేనే గలగలపారే సెలయేళ్లు చుట్టూ పచ్చని పొలాలతో కనువిందు చేస్తాయి. అయితే ఆ ప్రాంతం మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉంటుంది. పేరుకే గోదావరి పరివాహకమైనా కరవు సీమ అనంతపురం జిల్లా పరిస్థితులు ఇక్కడా కనిపిస్తుంటాయి. సారవంతమైన భూములున్నా నీటి వనరులు లేకపోవడంతో ఏ పంట వేసినా దిగుబడి అంతంతమాత్రమే. లక్షలు వెచ్చించి బోర్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటి నీటి చుక్క లేక పంటలు ఎండిపోతున్నాయి. పోలవరం కుడికాలువ నుంచి ఎత్తిపోతల ద్వారానైనా గోదారి జలాలు వస్తాయనుకుంటే ఏళ్లు గడుస్తున్నా ఆ కల సాకారం కావటం లేదు.
Farmers Facing Problems With Water Crisis : ఇది ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని మెట్టచెరువు ప్రాంతం. జిల్లాలోనే అత్యల్ప నీటి వనరులు కలిగిన ప్రదేశం. మొక్కజొన్న, పామాయిల్, నిమ్మ, జీడి మామిడి, అరటి, కూరగాయలు ఇలా అన్ని రకాల ఉద్యాన పంటలు సాగుచేస్తున్నా నీళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైతులు ఏనాడూ పూర్తిస్థాయిలో దిగుబడులు సాధించిన సందర్భాలు లేవు. ఎంత ఖర్చు చేసినా ఆదాయం అంతంత మాత్రమే. పంటను కాపాడుకోవాలనే ఆశతో చాలా డబ్బు వెచ్చించి బోర్లు వేసినా ప్రయోజనం శూన్యం. కేవలం పెదవేగి మండలంలోనే దాదాపు 70 నుంచి 80వేల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
భూగర్భజలాలు పాతాళానికి పడిపోవడంతో బోర్లు వేసినా చాలా వరకు కాలిపోతున్నాయి. కాస్తో కూస్తో బోరు నుంచి వచ్చే నీటిని పొదుపుగా వాడుకుంటూ డ్రిప్ ద్వారా పంటను కాపాడుకుంటున్నారు. మిగిలిన పంటలతో పోలిస్తే మొక్కజొన్న సాగుతో ఆదాయం వస్తుంది. కానీ పంట చివరి దశలో నీరందక రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు.
నీళ్ల సౌకర్యం లేకపోవడం, ఏ పంట వేసినా ఆదాయం రాకపోవడంతో కొంతమంది రైతులు ఉద్యాన పంటల జోలికి వెళ్లడంలేదు. భూములను ఖాళీగా ఉంచడానికి మనసొప్పక కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని అందించాలని రైతులు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకోవట్లేదు. కనీసం వచ్చే కొత్త ప్రభుత్వమైనా ప్రాజెక్టును పూర్తి చేస్తే... పంటలకు నీరందుతుందని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
జగన్ ఏలుబడిలో అటకెక్కిన జలయజ్ఞం - సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం - NEGLIGENCE ON JALAYAGNAM