Irrigation Minister Nimmala Ramanaidu on Projects: నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులతో సమీక్షించారు. గతంలో నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో గండ్లు పడుతున్న అంశంపై మంత్రి నిమ్మల అధికారులను వివరణ కోరారు. గడచిన ఐదేళ్లుగా నిర్లక్ష్యంగా పనిచేసిన అధికారులు పద్దతి మార్చుకోకుంటే తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కృష్ణాకు వరదలు రావడంతో, నాగార్జున సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఖరీప్ సీజన్‌ను 15 రోజుల ముందుగానే నీరు విడుదల చేసినట్టు మంత్రి నిమ్మల వెల్లడించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ జోన్-3 లో వెంటనే చెరువులు నింపి తాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం కారణంగా చింతలపూడి ఎత్తిపోతల ఎత్తిపోతల ఆగిపోయిందని మంత్రి తెలిపారు.
వరదల సమయంలో 90 రోజుల పాటు, 53 టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగు నీరు, 26 లక్షల మందికి తాగునీరు అందుతుందని వెల్లడించారు. రెండు జిల్లాల్లో 33 మండలాలు, 410 గ్రామాలు లబ్దిపొందుతాయని తెలిపారు.