Irregularities in ESI by Purchasing More Medicines: రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల వరకు ఉన్న ఈఎస్‌ఐ చందాదారులకు 78 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, నాలుగు ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. వైద్యసేవల ఖర్చులో కేంద్ర ప్రభుత్వానిదే అత్యధిక వాటా. డిస్పెన్సరీలకు మందులు కొనుగోలు చేసే బాధ్యతలను సెంట్రల్ డ్రగ్స్ సెంటర్లకు అప్పగించారు. వీటికి హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. నాలుగో త్రైమాసికానికి ఆస్పత్రులు, డిస్పెన్సరీల నుంచి సూపరింటెండెంట్లు మందుల ఇండెంట్లు తీసుకున్నారు. అదనంగా 10 శాతం మందుల కొనుగోలుకు అనుమతివ్వాలంటూ రాజమహేంద్రవరం ఆస్పత్రి సూపరింటెండెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాశారు.
10 శాతం వెనుక భారీ ప్లాన్: మూడో త్రైమాసికంలో ఈ ఆస్పత్రికి 3 కోట్ల రూపాయల విలువైన మందులు సరఫరా చేశారు. నాలుగో త్రైమాసికంలో ఇంకా ఎక్కువ ఇండెంట్ పెట్టాలంటే రూల్స్ ప్రకారం కుదరదు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు, హాస్పిటల్ కలిసి వైద్యశిబిరాలు నిర్వహించాలని కార్పొరేషన్ ఆదేశించిందని, తరచూ శిబిరాల నిర్వహణ, ఓపీ రోగులు పెరిగినందున గత సంవత్సరం కంటే 10 శాతం అదనంగా మందులు ఆర్డర్లు పెట్టేందుకు అనుమతివ్వాలంటూ సూపరింటెండెంట్ లేఖ రాయగానే ఉన్నతాధికారులు ఆమోదించేశారు.
ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 18.5 కోట్ల రూపాయల విలువైన మందులు కొన్నారు. అందులో చాలావరకు డిస్పెన్సరీలు, ఆస్పత్రులు ఉన్నాయి. మార్చి నెలాఖరుతో 2023-24 బడ్జెట్ అయిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్నందున ఇప్పుడే సాధ్యమైనంత ఎక్కువ మందులు కొనిపించి, కమీషన్లు కొట్టేయాలని కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఉపాధి హామీ పనుల్లో స్కామ్- మృతులు, వృద్ధుల పేర్లతో భారీ దోపిడీ
ఎన్టీఆర్ జిల్లాలో రోజూ 15 మంది రోగులు రాని ఓ డిస్పెన్సరీకి నాలుగో త్రైమాసికంలో 30 వేల దగ్గు సిరప్‌లు ఇండెంట్ పెట్టారు. ఫార్మసిస్టుకు తెలియకుండానే కోట్ల రూపాయల విలువైన మందుల ఇండెంట్ పెట్టడంతో భయాందోళనలకు గురై డైరెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ కొనుగోళ్లపై కొత్త ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే తాము జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడుతున్న కొందరు ఫార్మసిస్టులు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే ఇండెంట్లు పెట్టినట్లు ముందుగానే విజిలెన్స్‌కు లేఖ రాయాలని భావిస్తున్నారు.
కార్మికశాఖ మంత్రి సొంత జిల్లాలోని ఆదోని డయాగ్నస్టిక్ సెంటర్లో పని చేసే వైద్యుణ్ని ఇటీవల రాజమహేంద్రవరం ఆస్పత్రికి డిప్యుటేషన్‌పై పంపారు. తర్వాత ఆయన్ను సూపరింటెండెంట్‌గా నియమించారు. ఈ నియామకమే నిబంధనలకు విరుద్ధమని విమర్శలున్నాయి. అవసరాలకు మించి ఔషధాల కొనుగోళ్లలో ఆయన అడ్డూ అదుపూలేకుండా మంత్రి పేషీలోని ఓ ప్రైవేటు వ్యక్తి చెప్పినట్లు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. తీసుకునే మందుల్లోనూ ఎక్కువగా సిరప్లు ఉంటున్నాయి. ఎక్కువ ధర ఉండటంతో పాటు శిబిరాల్లో సులువుగా ఇచ్చే వీలుండటంతో వీటిని ఎంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.