INS Arighat Will be Commissioned Soon: భారత నౌకాదళం త్వరలో మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ స్ఫూర్తి, డిజైన్, అనుభవంతో తయారుచేసిన మరో అణు జలాంతర్గామి ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ను భారత నౌకాదళం నిర్మించింది.
అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని సైతం తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో (Shipbuilding Centre) 2011 డిసెంబరులో చేపట్టారు. తొలిదశ నిర్మాణం పూర్తైన తర్వాత 2017 నవంబరు 19వ తేదీన జలప్రవేశం చేయించారు.
అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశారు. సీ ట్రయల్స్ ప్రక్రియను సైతం పలు దఫాలుగా చేపట్టారు. ఈ సంవత్సరం సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రాజ్‌నాథ్‌సింగ్ ఆ మరుసటి రోజే విశాఖ నౌకాదళ స్థావరాన్ని సందర్శించారు.
ఆ సమయంలోనే ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ సమాచారాన్ని నౌకాదళ అధికారులు రాజ్‌నాథ్‌కు వెల్లడించినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నెల తొలి వారంలో ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ను జాతికి అంకితం చేయనున్నట్లు, ఆ ఏర్పాట్లలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ నెల 29వ తేదీన విశాఖకు వస్తున్నట్లు సమాచారం.
ఐఎన్‌ఎస్ అరిఘాత్ ప్రత్యేకతలు: అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ పొడవు 111.6 మీటర్లు ఉంటుంది. అదే విధంగా వెడల్పు 11 మీటర్లు కాగా, లోతు(డ్రాఫ్ట్) 9.5 మీటర్లు. సముద్ర ఉపరితలంలో గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్లు (22 నుంచి 28 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సముద్ర జలాల్లో 24 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఐఎన్‌ఎస్ అరిఘాత్‌లో రేడియేషన్ బయటకు పొక్కకుండా భత్రతా ఏర్పాట్లు చేశారు. ఇది సోనార్ కమ్యునికేషన్ వ్యవస్థ, సాగరిక క్షిపణుల వ్యవస్థ కలిగి ఉంది.
'ఐఎన్ఎస్ సంధాయక్' ను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సముద్రంలో శత్రువుల వేటకు ఇండియన్ నేవీ రెడీ- రంగంలోకి MH 60R సీహాక్ హెలికాప్టర్