Industries Closed During YSRCP Govt: పల్నాడు ప్రాంతంలో సున్నపురాయి విస్తారంగా లభిస్తుండటంతో సిమెంట్ పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత అనుకూలం. దశాబ్దం కిందట పలు కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడంతో అప్పటి ప్రభుత్వం మైనింగ్ లీజుకు వేల ఎకరాలు కేటాయించింది. యాజమాన్యాలు ఫ్యాక్టరీల నిర్మాణానికి రైతుల నుంచి భూములు సేకరించాయి. ఇక్కడ పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రైతులు భూములను విక్రయించారు. ఏళ్లు గడుస్తున్నా అనుమతుల పేరుతో యాజమాన్యాలు కాలయాపన చేస్తున్నాయి. వేల ఎకరాల సాగు భూములు నిరుపయోగంగా ఉండటంతో రైతులు, రైతు కూలీలు ఉపాధి కోల్పోయారు.
గత ప్రభుత్వంలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క సిమెంటు పరిశ్రమ మాత్రమే వారం రోజుల కిందట ఉత్పత్తి ప్రారంభించింది. ఇంకా ఐదుకుపైగా కంపెనీలు భూములు సేకరించి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. అందులో సీఎం జగన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన సరస్వతీ సిమెంట్ ఇండస్ట్రీస్ ఉంది. ఆయా కంపెనీలు సాంకేతిక కారణాలను సాకుగా చూపి పరిశ్రమలు స్థాపించకుండా జాప్యం చేస్తున్నాయి.
యువత భవితపై గుదిబండ - జగన్ దెబ్బకు పరిశ్రమలు అతలాకుతలం - Industries Closed During Jagan Govt
అనుమతులు రావడం లేదంటూ: సరస్వతీ, మైహోమ్, ఇమామి, అంబుజా కంపెనీలు భూములు సేకరించినా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకురావడం లేదు. భూముల లీజులు, వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మార్చుకోవడం, లీజు అనుమతులు, పర్యావరణ సంబంధిత అనుమతులు రావడం లేదని చెప్పి ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాయి. వీరు సేకరించిన వేల ఎకరాల భూముల్లో రైతులు పంటల సాగును కోల్పోయారు.జగన్, ఆయన కుటుంబ సభ్యులు వాటాలు కలిగి ఉన్న సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేటు లిమిటెడ్ కోసం పల్నాడు జిల్లా మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల పరిధిలో కలిపి 12వందల 11.19 ఎకరాలు కొనుగోలు చేశారు. 2009కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి అక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని భూములు కొనుగోలు చేశారు.
15 ఏళ్ల క్రితం భూమి తీసుకున్నప్పటికీ: భూములు కొనుగోలు చేసి 15ఏళ్లు దాటినా ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు పడలేదు. మాచవరం మండలం వేమవరంలో 713.6 ఎకరాలు, చెన్నాయపాలెంలో 288.87 ఎకరాలు, పిన్నెల్లిలో 93.79, దాచేపల్లి మండలం తంగెడలో 98.18, పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు 16.75 ఎకరాలు కొనుగోలు చేశారు. సీఎం జగన్ వాటాలు కలిగి ఉన్న కంపెనీ పల్నాడులో 15ఏళ్ల కిందట భూములు తీసుకుని ఇప్పటివరకు పరిశ్రమ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగనే అధికారం చెలాయిస్తున్నారు. తన పరిశ్రమనే ఇక్కడ ఏర్పాటుచేసి ప్రజలకు ఉపాధి కల్పించలేదు. సొంత పరిశ్రమ స్థాపించలేని ఆయన పెట్టుబడిదారులను ఒప్పించి పల్నాడుకు పరిశ్రమలు తీసుకువస్తారని ఎలా ఆశించగలమని స్థానికులు అనుకుంటున్నారు.
కలగానే మెగా టూరిజం పార్కు: పల్నాడు జిల్లాలో మానవ నిర్మిత మహాసాగరం నాగార్జునసాగర్ వద్ద మెగా టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కలగా మిగిలిపోయింది. చూపరులను కట్టిపడేసే ప్రకృతి రమణీయత ఉన్నా ప్రభుత్వ చొరవ లేక దస్త్రాలకే పరిమితమైంది. గత ప్రభుత్వంలో 2017లో మెగాటూరిజం ప్రాజెక్టుకు బీజం పడింది. అప్పట్లో 250 ఎకరాలను కేటాయిస్తూ రెవెన్యూశాఖ నుంచి పర్యాటకశాఖకు బదలాయించారు. అప్పట్లో 500కోట్ల రూపాయలతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వైసీపీ వచ్చిన తర్వాత ఒక కంపెనీ ఒప్పందం చేసుకున్నా అడుగు ముందుకు పడలేదు. బౌద్దులకు పవిత్రమైన ప్రాంతం కావడంతో అంతర్జాతీయ పర్యాటకులూ ఇక్కడికి వస్తుంటారు. 5 నక్షత్రాల హోటళ్లు, ఉద్యానవనాలు, ఈత కొలనులు, రకరకాల పక్షుల కేంద్రాల ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు పట్టాలెక్కలేదు. మెగాటూరిజం ప్రాజెక్టు ఏర్పాటైతే పర్యాటకుల సందడితో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆతిథ్యం, రవాణా, సేవల రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు పెరిగి యువతకు ఉపాధి లభించేది. సున్నపు బట్టీలకు ముడిరాయి రాయల్టీ ధర పెంపుతో ఉత్పత్తి ఖర్చు పెరిగి ఇతర రాష్ట్రాలతో పోటీపడలేక బట్టీలు వరుసగా మూతపడుతున్నాయి.
మూతపడుతున్న సున్నపుబట్టీలు: పిడుగురాళ్లలో ఐదేళ్ల కిందట 120 సున్నపు బట్టీలు ఉండగా ప్రస్తుతం 45 నుంచి 50కి పరిమితమయ్యాయి. ఒక్కో బట్టీ మూతపడటం వల్ల 25 మంది ఉపాధికి గండిపడింది. అదేవిధంగా పల్వరైజేషన్ మిల్లులు, సెమ్ తయారీ మిల్లులకు విద్యుత్తు బిల్లులు ఐదేళ్ల కిందటితో పోల్చితే 25 నుంచి 30శాతం పెరగడంతో వారంతా ఉత్పత్తి తగ్గించుకుని ఒక షిప్టు మాత్రమే నడుపుతున్నారు.దీంతో వందల మంది ఉపాధి కోల్పోయారు. ఒకప్పుడు సున్నం, అనుబంధ ఉత్పత్తులకు కేంద్రంగా ఉన్న పిడుగురాళ్ల ప్రాంతం క్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోందని యజమానులు వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్త ఉపాధి అవకాశాలు రాకపోగా ఉన్న ఉపాధికి గండిపడిందని ఆవేదన చెందుతున్నారు.