Corn Polymer Bags Use in Hyderabad : ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా 'కార్న్ పాలిమర్' (సులభంగా భూమిలో కరిగే ప్లాస్టిక్) వినియోగం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో క్రమంగా పెరుగుతోంది. రెస్టారెంట్లు, ఆసుపత్రులు, వాణిజ్య సంస్థల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా సగటున ఒక్కో పరిశ్రమలో లక్ష కేజీల బ్యాగులు విక్రయం జరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ నగరంలో రోజూ ఉత్పత్తి అయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలతో పోల్చితే 10-15 శాతం మాత్రమే కార్న్ పాలిమర్ బ్యాగులు ఉంటున్నాయి. ఈ సంఖ్య మరింతగా పెరిగితే ప్లాస్టిక్ కాలుష్యం తగ్గే అవకాశం ఉందని నిపుణలు అంటున్నారు.
కార్న్ పాలిమర్ సంచుల ఉపయోగించడం మేలు : కార్న్ పాలిమర్ అనేది మొక్కజొన్న పిండితో తయారవుతుంది. 180 రోజుల్లోనే భూమిలో కరిగిపోతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పలు దశల్లో పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేసి లైసెన్సు జారీ చేసిన తరువాతే ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. జీడిమెట్లలో ఇప్పటికే పదుల సంఖ్యలో బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ పరిశ్రమలు ఏర్పాటు చేయగా, విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయని నిర్వాహకులు అంటున్నారు. జ్యూట్, కాగితం, క్లాత్ బ్యాగుల కంటే కార్న్ పాలిమర్ సంచుల ఉపయోగించడం మేలని నిఫుణులు సూచిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని పరిశ్రమల నిర్వాహకులు కోరుతున్నారు.
క్యారీ బ్యాగ్‌పై డబ్బులు వసూలు చేశారా? ఇలా చేస్తే పరిహారం గ్యారెంటీ!
నెల వ్యవధిలో కోటి క్యారీ బ్యాగ్‌లు వినియోగం : గ్రేటర్ పరిధిలో రోజూ సగటున ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రతి సంవత్సరం 2,26,092 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు రీ సైక్లింగ్ వ్యవస్థ ఎక్కడా లేదు. నిషేధం ఉన్నా దుస్తులు, కూరగాయల మార్కెట్లు, మాంసం, కిరాణా దుకాణాల్లో ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇలా గ్రేటర్ పరిధిలో నెల వ్యవధిలో కోటి క్యారీ బ్యాగ్‌లు వినియోగిస్తున్నట్లు ఓ అంచనా. ఫలితంగా ఏడు వందల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్లాస్టిక్ వ్యర్థాలతో సీసీరోడ్డు నిర్మాణం- కాలేజీ పరిశోధనకు పేటెంట్