Illegal Sand Mining in Andhra Pradesh: ఎన్నికల ప్రచారానికి అధికార వైఎస్సార్సీపీ పచ్చనోట్లు అనధికారికంగానే కాదు, అధికారికంగానూ కుమ్మరిస్తోంది. జగన్ మేమంతా సిద్ధం సభలకు వేలసంఖ్యలో ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటున్న వైఎస్సార్సీపీ వాటికి కోట్ల రూపాయల డబ్బును నగదు రూపంలో చెల్లించింది. అంత సొమ్ము వైఎస్సార్సీపీకి ఎక్కడిది? అదే జగన్ రాసుకున్న ఇసుక దోపిడీ స్క్రిప్ట్!
ఇసుకను అడ్డుపెట్టుకుని వేలకోట్లు ఊడ్చేసి ఎన్నికల వేళ వాటిని ఎలా బయటకు తీయాలో పక్కా స్కెచ్ వేసుకున్నారు. అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఇసుక రూపంలో ప్రజలపై అధికారికంగా వేసిన భారమే 4 వేల 200 కోట్ల రూపాయలు. ఏపీఎండీసీ (ANDHRA PRADESH MINERAL DEVELOPMENT CORPORATION LTD) ద్వారా ఇసుక అమ్మిన మొదటి 20 నెలల్లో ప్రజల నుంచి రూ. 1680 కోట్లు రాబట్టారు. ప్రైవేటు గుత్తేదారులు వచ్చాక రూ. 2 వేల 520 కోట్లు పిండుకున్నారు. ఇక ప్రభుత్వానికి లెక్క చూపకుండా రూ. 3 వేల కోట్లపైనే దోచుకున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు - కోడ్ ఉన్నా ఆగని దోపిడీ - YCP LEADERS ILLEGAL SAND MINING
రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా ఏర్పడిన కొరత: తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. జగన్ సీఎంకాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారు. నదుల్లో లభించే ఇసుకను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. 2019, సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వరంగ సంస్థైన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు మొదట్లో అప్పగించారు! ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయం కల్పించినప్పటికీ ఎక్కువ మందికి ఇసుక లభించలేదు.
అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది. అయిదారు నెలలపాటు ఇసుక దొరకడమే గగనమైంది. ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయి అడ్డాకూలీలు ఆకలికేకలు వేశారు. భవననిర్మాణ రంగానికి అనుబంధంగా ఉండే 40 రంగాల కార్మికులూ పనుల్లేక పస్తులున్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు అయిదారు నెలలపాటు పనుల్లేక అల్లాడారు. అప్పుడు మేల్కొన్న సీఎం, ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ అక్కడి నుంచే దోపిడీ స్క్రిప్ట్ అమలుచేశారు.
ఇసుక తవ్వకాల దందా నిజమే - గనుల శాఖ సంచలన నివేదిక - Mining Sensational Report
మొత్తం నగదు రూపంలోనే వసూలు: 2021 జనవరిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇసుక టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని 3 ప్యాకేజీలను ఉత్తరాదికి చెందిన జయ్‌ప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకునేలా వ్యూహం రచించారు. టన్ను ఇసుక ధరను 475 రూపాయలకు పెంచేశారు. అయితే ఈ టెండర్లకు సరిగ్గా రెండు వారాల ముందు, చెన్నై కేంద్రంగా టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. వైఎస్సార్సీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన చెన్నై మైనింగ్ వ్యాపారే టర్న్‌కీ సూత్రధారి. అలా ఇసుకలో ఉపగుత్తేదారుగా రంగప్రవేశం చేసింది టర్న్‌కీ. ఏపీఎండీసీ ద్వారా ఇసుక లావాదేవీలు ఆన్‌లైన్ చెల్లింపులతో జరిగేవి. టర్న్‌కీ వచ్చాక, మొత్తం నగదు రూపంలోనే వసూలు చేశారు.
ప్రతి రీచ్‌లో వసూలైన నగదును హైదరాబాద్‌లో ప్రభుత్వ పెద్దలు చెప్పినచోట అందజేస్తూ వచ్చారు. ముద్రిత బిల్లులు జారీచేస్తూ గనులశాఖకు తప్పుడు లెక్కలు చూపారు. రీచ్‌ల్లో అక్రమాలు బయటకు రాకుండా అక్కడ ఉండే సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా చేశారు. అసలు టర్న్‌కీకి ఎందుకు ఇవ్వాలని భావించిన ప్రభుత్వ పెద్దలు 2022 ఆగస్టులో దాన్ని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. ‘ముఖ్య’నేత సోదరుడే సీన్‌లోకి వచ్చారు! ప్రతి ఉమ్మడి జిల్లాకు ఓ సిండికేట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లాను కీలక నేతకు అప్పగించారు. ఆ నేతలు జిల్లాల్లో రీచ్‌ల వారీగా ఎవరు ఎక్కువ సొమ్మిస్తే వారికి కట్టబెట్టారు. వాళ్ల నుంచి ప్రతినెలా సొమ్ము వసూలుచేసి అందులో నామమాత్రంగా కొంతే ప్రభుత్వానికి లెక్క చూపించి, మిగిలినదంతా దారిమళ్లించారు.
ఇసుక వ్యాపారులను పిండి పిప్పిచేశారు: వైఎస్సార్సీపీ సిండికేట్లు జిల్లాల్లో ఇసుక వ్యాపారులను పిండి పిప్పిచేశారు. వీరి ఒత్తిళ్లకు తట్టుకోలేక తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన ఇసుక వ్యాపారి ప్రేమ్‌రాజు గత సంవత్సరం మార్చిలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 3 నెలల్లో 21 కోట్ల రూపాయలు నష్టమొచ్చినా ఆ సొమ్ము కోసం ఒత్తిడి చేయడంతో బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. కడప జిల్లాలో ఓ ఇసుక రీచ్ కోసం నారాయణరెడ్డి అనే వ్యక్తి ఆ జిల్లా సిండికేట్ నిర్వాహకుడైన ఆర్టీసీ ఛైర్మన్ సోదరుడు వీరారెడ్డికి 81 లక్షల రూపాయలు ఇచ్చాడు. కొద్దిరోజులు రీచ్‌లో తవ్వకాలు జరిపాక, అనుమతులు లేవంటూ నిలిపేశారు.
అతడి సొమ్ము వెనక్కి ఇవ్వకపోవడంతో, గతేడాది జూన్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానిక వ్యాపారులను ఇంతలా వేధించిన పెద్దలు బకాయిలు చెల్లించని జేపీ సంస్థను మాత్రం పల్లెత్తుమాట అనడంలేదు జేపీ సంస్థ ఇసుక వ్యాపార ఒప్పంద గడువు 2021 మే నుంచి 2023 మే వరకు ఉండగా నవంబరు వరకూ కొనసాగినట్లు చూపారు. జేపీ సంస్థ ప్రభుత్వానికి నెలకు 63కోట్ల 66 లక్షల చొప్పున 30 నెలలకు 1909 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ1059 కోట్ల రూపాయలే ప్రభుత్వానికి చెల్లించిందని గనులశాఖ అధికారులు జీఎస్టీ అధికారులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వానికి ఇంకా చెల్లించాల్సిన 850 కోట్లు ఎటువెళ్లాయో, ఎప్పుడొస్తాయో స్పష్టత లేదు.
అధికారుల అండతో ఇసుక దోపిడీ- కనుమరుగవుతున్న భూములు - Illegal Sand Mining in Konaseema
‘ముఖ్య’నేత సోదరుడి ముఠా తవ్వకాలు: రాష్ట్రంలో ఇసుక వ్యాపారంకోసం గతేడాది చివర్లో మళ్లీ టెండర్లు పిలిస్తే రెండు ప్యాకేజీలను తెలంగాణకు చెందిన ప్రతిమ ఇన్‌ఫ్రా, ఓ ప్యాకేజీని రాజస్థాన్‌కి చెందిన జీసీకేసీ అనే సంస్థలకు దక్కేలా చేశారు. పేరుకే ఇవి గుత్తేదారు సంస్థలు. వాటి పేరిట ‘ముఖ్య’నేత సోదరుడే ఇసుక వ్యాపారం చూస్తున్నారు. ఆయన తరఫున గుంటూరు జిల్లాకు చెందిన అంజిరెడ్డి ప్రధానపాత్ర పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు నిత్యం వందలాది లోడ్లు పంపుతూ లక్షలు పోగేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వొద్దని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించాయి.
110 రీచ్‌ల్లో తవ్వకాలు ఆపేయాలని గనులశాఖను, అదే విధంగా గుత్తేదారు జేపీ సంస్థను గత సంవత్సరం ఏప్రిల్‌లో పర్యావరణ మదింపు సంస్థ- సియా ఆదేశించింది. కానీ తవ్వకాలు ఆపలేదు సరికదా, మళ్లీ అధికారం దక్కుతుందో లేదో అనే బెంగతో భారీ యంత్రాల్ని పెట్టి, నదులను ఊడ్చేశారు. అయితే ఎక్కడా ఉల్లంఘనలు లేవని జిల్లాల కలెక్టర్లు ఎన్జీటీ (National Green Tribunal ) కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేసినా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మాత్రం ఉల్లంఘనలు నిజమని నిగ్గుతేల్చింది. అయినా, ‘ముఖ్య’నేత సోదరుడి ముఠా తవ్వకాలు ఆపలేదు.
ఇసుక ధరపై హైకోర్టు విస్మయం - బంగారంతో పోటీ పడుతోందంటూ వ్యాఖ్య