Srisailam Temple Lands Issue : శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానానికి సమాంతరంగా ప్రైవేట్ ట్రస్టు ద్వారా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం నిర్మాణ ప్రతిపాదనపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్కార్ దృష్టిపెట్టాలని సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే గుడి నిర్మాణం వెనక ఎవరున్నారనే విషయంలో అనేక వివరాలు బయటకొస్తున్నాయి.
శ్రీశైలం మల్లన్న దేవాలయం వెనకవైపు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడిని నిర్మిస్తామని, వనాలు పెంచుతామని హైదరాబాద్‌కు చెందిన విజన్ బృందావన్ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ 2016లో అభ్యర్థించింది. అందుకోసం అక్కడి ఏనుగుల చెరువు, హెలిప్యాడ్ ప్రాంతంలో 14 ఎకరాలు కేటాయించాలంటూ కోరింది. దీనిపై అప్పట్లో ఆలయ పాలకవర్గం లేకపోవడంతో దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్, కమిషనర్ అనురాధ, శ్రీశైలం ఆలయ ఈవో భరత్‌గుప్తాలతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీ ఆ అభ్యర్థన పరిశీలించింది. వారికి రెండెకరాలు కేటాయించాలని తీర్మానించింది. ఒక ఎకరాలో ఆలయం నిర్మించాలని, మరో ఎకరాలో సుందరీకరణ చేసి, వాటిని శ్రీశైలం దేవస్థానానికి అప్పగించాలని తెలిపింది. ఆ తర్వాత ఈ స్థల కేటాయింపుపై అధికారిక ఉత్తర్వు ఏదీ జారీ కాలేదు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హడావిడి : 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో వీబీ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థ, ట్రస్టు ద్వారా లాబీయింగ్ చేసింది. రూ.250 కోట్లతో గుడిని నిర్మిస్తామని హడావుడి చేసింది. ఆ సర్కార్‌లో కీలకంగా వ్యవహరించిన అజేయ కల్లం ట్రస్టీ కావడంతో ఆయన ద్వారా అనుమతులు పొందేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దిల్లీలోని అక్షర్‌ధామ్ తరహాలో భారీ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధంచేసింది. దేవాలయం చుట్టూ మాడవీధులు, ఉద్యానవనాలు, ఒక్కో ఉద్యానవనంలో ఒక్కో జ్యోతిర్లింగం, సప్తరుషి గార్డెన్, ఆడిటోరియం, లైట్ అండ్ సౌండ్ షోలతో ప్రాజెక్ట్ సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ప్రణాళికలు, డిజైన్లు, నమూనా చిత్రాల పుస్తకాన్ని 2020 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనుమతుల కోసం పట్టు : ఇంత భారీ దేవాలయానికి దేవాదాయశాఖ కమిషనరేట్‌లో ఉండే స్థపతి, చీఫ్ ఇంజినీర్, శ్రీశైలం ఆలయ అధికారుల అనుమతులు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వీబీ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత ప్రభాకర్‌రావు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్ ప్రాజెక్టు నమూనా ఆవిష్కరించారని, త్వరలో శంకుస్థాపనకు వస్తారని చెబుతూ వచ్చారు. దీనికి అనుమతులు ఇచ్చి తీరాల్సిందేనని అధికారులపై వారు ఒత్తిళ్లు తెచ్చారు.
భూ కేటాయింపు, గుడి నిర్మాణం పూర్తయ్యాక శ్రీశైలం దేవస్థానానికి అప్పగించడం తదితరాలపై ఒప్పందం చేసుకోవడానికి రావాలని ఆలయ ఈవో ఎన్నిసార్లు వీబీ టెక్నోక్రాఫ్ట్స్ సంస్థకు విన్నవించినా ముందుకురాలేదు. ఇంత భారీ దేవాలయం నిర్మాణాన్ని, చారిత్రక నేపథ్యమున్న ఏనుగుల చెరువును ఆధీనంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్, మరొకరు దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేయడంతో స్టే విధించింది.
ఈవో రామారావు బదిలీకి కారణమిదేనా? : శ్రీశైలం ఆలయ ఈవోగా 2019 ఆగస్టులో వచ్చిన కేఎస్ రామారావు (ప్రస్తుత విజయవాడ దుర్గగుడి ఈవో) వీబీ టెక్నోక్రాఫ్ట్స్ తీరును మొదటినుంచి తప్పుబట్టారు. భారీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేమని చెప్పారు. దీనిపై దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఆయన పలు లేఖలు రాశారు. తర్వాత ఉన్నట్టుండి కేఎస్ రామారావు బదిలీ అయ్యారు. అనంతరం ఈవోగా వచ్చిన లవణ్ణ గుడి నిర్మాణానికి వంతపాడినట్లు తెలిసింది. ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో దేవాలయ నిర్మాణం చేపట్టేలా సహకరించారు. ఓ దఫా పనులు ఆరంభించే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు పెద్దఎత్తున వ్యతిరేకించడంతో దీనిపై వెనక్కి తగ్గారు.
- శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం వెనుక సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి నిర్మిస్తామంటూ ఓ సంస్థ చేసిన విజ్ఞప్తితో గతంలో రెండెకరాలు కేటాయించారు. కానీ అధికారికంగా భూకేటాయింపు ఉత్తర్వు ఇవ్వలేదు. దేవాలయ నిర్మాణానికి దేవాదాయశాఖ, శ్రీశైలం ఆలయ అధికారులూ అనుమతులు జారీ చేయలేదు.
- అయినా ఆ సంస్థ 28 ఎకరాలను తన ఆధీనంలోకి తీసుకుంది. మాజీ సీఎస్ అజేయ కల్లం వంటి ముఖ్యులతో ట్రస్టు ఏర్పాటు చేసింది. విరాళాల సేకరణకు సిద్ధమైంది. మల్లన్న ఆలయాన్ని మించి పెద్ద దేవాలయం కడతామని, ఇందుకు సహకరించాలంటూ దేవాదాయశాఖపై గత సర్కార్‌లో ఉన్నతస్థాయిలో ఒత్తిడి తెచ్చింది. నాటి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి గుడి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించింది. చివరకు హైకోర్టు జోక్యంతో ఈ వ్యవహారం ఆగింది.
తెరపైకి ట్రస్టు అంతా వాళ్ల ఇష్టమే : వీబీ టెక్నోక్రాఫ్ట్స్ రెండెకరాలంటూ వచ్చి మొదట 16 ఎకరాలు, ఆ తర్వాత 28 ఎకరాలు తన ఆధీనంలోకి తీసుకుంది. గుడి నిర్మాణానికి ఏపీ మాజీ సీఎస్ అజేయ కల్లం, మరో ఇద్దరు ట్రస్టీలుగా 2018లో సేనాని సుబ్రహ్మణ్యస్వామి ట్రస్టు ఏర్పాటు చేసింది. ట్రస్టు తరఫున విరాళాలు సేకరించి, దేవాలయం నిర్మిస్తామని డీడ్‌లో పేర్కొంది. అప్పట్లో శృంగేరి పీఠాధిపతి శ్రీశైలానికి వచ్చినప్పుడు ఆయనతో దేవస్థానం నిర్మాణానికి మొక్కుబడిగా శంకుస్థాపన చేయించారు. పూర్తిస్థాయి అనుమతులు రాకపోవడంతో నిర్మాణం చేపట్టలేదు.